
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నవంబర్ 1న జరిగే సాధికారిక బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు. మండలంలోని అడ్డాపుశిల సచివాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బస్సు యాత్ర సన్నాహక సమావేశాల్లో భాగంగా సోమవారం పార్వతీపురంలో జరిగే సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ, వై.వి సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశానికి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు ఎంపిటిసిలు, సర్పంచులు, గృహ సారథులు, కార్యకర్తలు, వాలంటీర్లు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సచివాలయం నూతన భవనం నిర్మాణం విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమవారం తహశీల్దార్ గ్రామానికి విచ్చేసి స్థలం చూపించి భవన నిర్మాణం కొరకు క్లియర్ చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, వైస్ ఎంపిపి బి.రవికుమార్, నాయకులు బలగ నాగేశ్వరరావు, మజ్జి శేఖర్, ఆయా గ్రామాల సర్పంచ్లు పెండ రమణ, రామకృష్ణ, ఎంపీటీసీ ఎస్.కృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.