Jun 17,2023 00:24

కరపత్రాలు పంపిణీచేస్తున్న వెంకటరెడ్డి

ప్రజాశక్తి-యంత్రాంగం : జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ఈ నెల 19న చేపట్టే సకల కార్మికుల నిరవధిక సమ్మెకు సంబంధించి కరపత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు.
పెందుర్తి :
వేపగుంటలోని జివిఎంసి నీటి సరఫరా విభాగం కార్మికులకు కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్‌్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 19న చేపట్టే సకల కార్మికుల నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భర్తీ చేస్తున్న పోస్టులను కార్మిక కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, జెసిఎల్‌ ఆదేశాల ప్రకారం రూ.18,500 వేతనం చెల్లించాలని, చెత్త తరలించే డ్రైవర్లు, మలేరియా, వెటర్నరీ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించాలని, సబ్బులు, నూనెలు, చెప్పులు, మాస్కులు, గ్లౌజులు, టవల్స్‌ సరిపడా సరఫరా చేయాలని, జిఒ 333 ప్రకారం ఏరియర్స్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌, విలీన కార్మికుల 13 నెలల పిఎఫ్‌, ఈఎస్‌ఐ సొమ్ము చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఈ డిమాండ్లపై చర్చలు సఫలం కాకపోతే కార్మికులందరూ సమ్మెకు సహకరించాలని కోరారు.
గాజువాక : నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేయనున్నట్లు జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి గొలగాని అప్పారావు తెలిపారు. సిఐటియు గాజువాక జోన్‌ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక జోన్‌ కమిటీ నాయకులు గొల్ల రాము, ఎం.రాంబాబు, ఎ.లోకేష్‌, కె.అప్పలరాజు, గణేష్‌, చిన్నారావు, సత్యవతి, వరలక్ష్మి, అప్పన్న, సురేష్‌, క్లాప్‌ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.