Nov 09,2023 22:05

19న మాల మహానాడు విజయోత్సవ మహాసభ
మాల మహానాడు జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యమల సుదర్శనం
ప్రజాశక్తి- కుప్పం:
మాలమహానాడు విజయోత్సవ మహాసభను విజయవంతం చేయాలంటూ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నన్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎన్జీవో హోంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి పాలకులు 59 ఉపకులాలను జనాభా ప్రాతిపదికన నాలుగు గ్రూపులుగా విభజించారని, మాదిగలు మాలల కన్నా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని వారి విద్య ఉద్యోగ అవకాశాలు మాలలు దోచుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేసి ఏబిసిడిలుగా విభజించారని అన్నారు. అయితే ఆ విధంగా గ్రూపు ఏలో 12 కులాలకు ఒక్క శాతం మాదిగలతో పాటు బి గ్రూపులో 17 ఇతర కులాలకు ఏడు శాతం మాలలతో పాటు సి గ్రూపులో 24 కులాలకు ఆరు శాతం డి గ్రూపులోని నాలుగు కులాలకు ఒక్క శాతం రిజర్వేషన్‌ కల్పించడం జరిగిందని, ఈ వర్గీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఆదేశాలకు అనుగుణంగా ప్రజలలోనికి ఉద్యమం తీసుకుపోవడానికి తాము నడుం కట్టామని ఈసందర్భంగా మాల మహానాడు విజయోత్సవ మహాసభను నిర్వహించడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు సిఎస్‌ఐజెసిఎం కమ్యూనిటీ హాల్‌ మదనపల్లిలో ఈ సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు స్వచ్ఛందంగా దళితులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. మాల మహానాడు చిత్తూరు జిల్లా అధ్యక్షులు కందస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు గుండా మనోహర్‌, జిల్లా కార్యదర్శులు కలైసెల్వం, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.