ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్ 27 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4,534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం పొందుతారు. వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్దులకు సంబంధించి గత ఏడాది ఆగస్టు నెలలో ఒంగోలులోని డిఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో అర్హతా పత్రాల పరిశీలన జరిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 730 మంది మంది హాజరయ్యారు. నూతనంగా విడుదల చేసిన జివోలో 60 ఏళ్లు పైబడిన వారిని అనర్హులుగా ప్రకటించాలని తెలిపారు. ఈ కారణంగా అర్హులైన వారిలో 100 మందికి పైగా తప్పుకోవలసి ఉంటుందని తెలుస్తోంది. అప్పటి డిఎస్సీలో వచ్చిన క్వాలిఫైయింగ్ మార్కులతో పాటు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకుని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నూతన మార్గదర్శకాల మేరకు కౌన్సెలింగ్ జరిపి మినిమం టైమ్‌స్కేల్ పద్ధతిలో నెలకు రూ.34 వేల వేతనంతో నియామకాలు జరుపనున్నారు. రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన రిజర్వేషన్లను కూడా పరిగణలోకి తీసుకుని జిల్లాకు కేటాయించిన పోస్టుల సంఖ్య ఆధారంగా నియామకాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే రాష్టవ్యాప్తంగా జరిపిన అర్హతా పత్రాల పరిశీలనలో 6,852 మంది అప్పట్లో అర్హులుగా తేలారు. ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4,534 పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నట్లు జీవోలో తెలిపారు. దీని ప్రకారం ఉమ్మడి ప్రకాశంలో అర్హులుగా తేలిన 730 మందిలో ఎంతమందికి పోస్టులు దక్కుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.










