May 03,2023 00:22

జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఆండ్ర మాల్యాద్రి, అభ్యర్థులు

ప్రజాశక్తి-గుంటూరు : డిఎస్‌సి -1998లో అర్హత సాధించిన అభ్యుర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, 1998 డిఎస్‌సి పోరాట కమిటీ కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. డిఎస్‌సి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్‌, డిఇఒ కార్యాలయం ఎదుట మంగళవారం భారీధర్నా నిర్వహించారు. ధర్నాలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాల్యాద్రి మాట్లాడుతూ 1998 డీఎస్సీలో క్యాలిఫై అయిన అభ్యర్థులకు రోస్టర్‌ విధానం, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరారు. ఆనాటి ముఖ్యమంత్రులు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, కె.రోశయ్య, ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎన్‌.చంద్రబాబునాయుడు 1998 డిఎస్‌సి అభ్యర్థులను పట్టించుకోలేదని, జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక 2022లో 98 క్యాలిఫైడ్‌ అభ్యర్థులను 5887 మందిని తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించినా ఆచరణలో 4072 మందిని మాత్రమే తీసుకున్నారని తెలిపారు. నియామక ప్రక్రియలో రోస్టర్‌ విధానం, రిజర్వేషన్లు పాటించకపోవటం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు, వికలాంగుల అభ్యర్థులు నష్టపోయారన్నారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయినా ఇంకా 2,682 మందికి రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 559 మందికి పోస్టింగ్‌లు ఇవ్వలేదన్నారు. తక్షణమే వారికి పోస్టింగ్‌ ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ వై.కృష్ణకాంత్‌ మాట్లాడుతూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన న్యాయ సమ్మతమన్నారు. 98 డిఎస్‌సి అభ్యర్థులకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ నగర అధ్యక్షులు కొండలరావు, అభ్యర్థులు వి.మేరి సుహషిణి, పి.రమణ, సారిక, విశ్వరూపచారి, రమేష్‌, చెన్నెం శేఖర్‌, టి.ఏసుబాబు, వి.జ్యోతిమాల పాల్గొన్నారు.