Nov 14,2023 23:32

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వేణు

సాగునీటి సలహామండలి సమావేశంలో
మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ
ప్రజాశక్తి - కాకినాడ
సమర్ధ నీటి యాజమాన్య ప్రణాళికతో కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ సాగునీటి వ్యవస్థల క్రింద ఉన్న మొత్తం లక్షా 91 వేల ఎకరాల పూర్తి ఆయకట్టుకు రబీ పంటల సాగుకు నీరు అందిస్తామని రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ వివేకానంద సమావేశ హాలులో కాకినాడ జిల్లా సాగునీటి సలహా మండలి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు కలెక్టర్‌ డాక్టర్‌ కతికా శుక్లా అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాలకు మంత్రి వేణు ముఖ్యఅతిథిగా, ఎంఎల్‌ఎలు కురసాల కన్నబాబు, పెండెం దొరబాబు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర స్థాయిలో ముఖ్య మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రబీ పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు, ఆవాసాలకు తాగునీరు అందించాలని గైకొన్న నిర్ణయాల కనుగుణంగా ఫసలీ 1433, 2023-24 రబీ సీజనుకు జిల్లాలోని పంటలకు సాగునీరు అందించే ప్రణాళికను సలహా మండలి సమీక్ష, ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని ఇరిగేషన్‌ ఎస్‌ఇని కోరారు. ఈ మేరకు కాకినాడ జిల్లా పరిధిలో వివిధ సాగునీటి వ్యవస్థల క్రింద నీటి సరఫరాకు రబీ ప్రణాళికలను ఇరికేషన్‌ ఎస్‌ఇ జి.శ్రీనివాసరావు మండలికి వివరించారు. ఈ సందర్భంగా గోదావరి తూర్పు, మద్య, పశ్ఛిమ డెల్టాల పరిధిలోని మొత్తం ఆయకట్టు 8.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు 91.35 టిఎంసిల సాగునీరు అవసరం ఉండగా, 82.49 టిఎంసిల నీటి లభ్యత ఉందన్నారు. సుమారు 10 శాతం నీటి కొరత ఉందని ఆయన తెలిపారు. వారాబంది విధానం, క్రాస్‌ బండ్‌లు, డీజెల్‌ ఇంజన్లతో లిప్టింగ్‌, మందస్తు వరి నాట్లు ద్వారా ఈ కొరతను అధిగమించి మొత్తం ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో తూర్పు డెల్టా పరిధిలోని లక్షా 5 వేల ఎకరాలు, పిఠాపురం బ్రాంచి కెనాల్‌ పరిధిలోని 32,500 ఎకరాలు పూర్తి ఆకట్టు మేరకు సాగునీటి సరఫరాకు ప్రతిపాదిస్తున్నామన్నారు. పిబిసి పరిధిలో 22,260 ఎకరాల్లో వరి సాగుకు, 10,240 ఎకరాల మెట్ట, శివారు ఆయకట్టులో అపరాలు సాగుకు ప్రతిపాదించామన్నారు.
ఏలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 11.31 టిఎంసిల నీటి నిల్వ ఉండగా, ఇందులో 4.50 టిఎంసిలు విశాఖ నగర తాగునీటి అవసరాలు, స్టీల్‌ ప్లాంట్‌ అవసరాలకు, మరో 4.5 టిఎంసిలు డెడ్‌ స్టోరేజి నిమిత్తం కేటాయించామన్నారు. మరో 2.31 టిఎంసిలు ఏలేరు వ్యవస్థలోని 53 వేల ఎకరాలలో రబీ పంటలకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇందులో 28 వేల ఎకరాల్లో వరి సాగుకు, 25 వేల ఎకరాలలో అపరాల పంటలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించామన్నారు.
అనంతరం జరిగిన చర్చలో గోదావరి నదికి ఎగువ నుండి నీరు చేరే సూచనల దష్ట్యా రబీ పంటలకు సాగునీటి ఎద్దడి లేకుండా నివారించేందుకు, పోలవరం బారేజిలో గేట్లు దింపి, కనీసం 20 టిఎంసిల నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు చేసిన ప్రతిపాదనను మండలి ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని తీర్మానం చేసింది.
ఏలేరులో డెడ్‌ స్టోరేజి స్థాయిని 4.5 టియంసిలకు బదులు 2 టిఎంసిలకు తగ్గించి, ఈ మేరకు వీలైనంత మెట్ట, శివారు ఆయకట్టులో అపరాలకు బదులు, వరి సాగుకు అవకాశం కల్పించాలని పిఠాపురం ఎంఎల్‌ఎ పెండెం దొరబాబు, రైతు ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి మండలి సానుకూలంగా స్పందించి ఈ మేరకు ప్రతిపాదనలు సవరించాలని ఇరిగేషన్‌ ఎస్‌ఈని కోరింది.
అందుబాటులో ఉన్న నీటితో రబీ పంటలను సజావుగా, సకాలంలో 2024 మార్చి 31వ తేదీలోపున పూర్తి చేసుకునేందుకు, రైతులు డిశంబరు 31 లోగా నాట్లు పూర్తి చేసుకోవాలని, ఖరీఫ్‌ ఆలస్యమైన రైతులు పంటకాలం కలిసి వచ్చేందుకు డిశంబరు 10వ తేదీ లోపున వెదజల్లే పద్దతిలో నాట్లు వేసుసువాలన్నారు. ఈ మేరకు ఆర్‌బెకె స్థాయిలో విస్తత రైతు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సాగునీటి సమర్థ వినియోగం కొరకు 2024 జనవరి చివరి వారం నుండి వంతుల వారీ వారాబంది విధానాన్ని అమలు చేయాలన్నారు. ఏ భూములకు ఏప్పుడు నీరిచ్చేది స్పష్టంగా షెడ్యూల్‌ రూపొందించి రైతులందరికీ సమగ్ర అవగాహన కల్పించాలని ఆమె కోరారు. రబీ పంటలకు సాగునీటి సరఫరా ప్రారంభానికి మందే ఆక్వా అవసరాల కొరకు నీటిని నిలుపుకోనే ప్రక్రియను పూర్తి చేసి, నిలుపుచేయాలని ఆదేశించారు.
సమావేశంలో రబీ సాగునీటి విడుదలకు ముందు నీటి పారుదల సమస్యల నివారణకు తూర్పు డెల్టా పరిధిలో 45.97 లక్షలతో 4 పనులు, కాకినాడ డ్రెయినేజీ డివిజన్‌ పరిధిలో రూ.41.12 లక్షల నిధులతో 12 పనులు , ఏలేరు డివిజన్‌ పరిధిలో రూ.48.02 లక్షలతో 9 పనులు వెరసి మొత్తం రూ.1.45 కోట్ల డిఎంఎఫ్‌ నిధులతో 25 పనులను మంజూరు చేశామన్నారు. అలాగే 5 లక్షల లోపు పనులను నామినేషన్‌ పద్ధతిపై రైతు సంఘాలే నిర్వహించుకునేందుకు మండలి ఆమోదం తెలిపింది. సమర్ధ సాగునీటి సరఫరా కొరకు ఈ రబీలో 42 ఆయిల్‌ ఇంజన్లు, 30 క్రాస్‌ బండ్లు, 8 షట్లర్లు, స్లూయిస్‌ ల ఏర్పాటు 31 డీసిల్టింగ్‌, వీడ్‌ రిమూవల్‌ పనులు, ఒక ఐడిసి పని ప్రతిపాదించామన్నారు. మంత్రి వేణు మాట్లాడుతూ రైతు సంక్షేమం దష్టిలో ఉంచుకుని రబీలో పూర్తి విస్తీర్ణానికి సాగునీరు అందించాలనే ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకనుగుణంగా ఇరిగేషన్‌, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జెసి ఎస్‌.ఇలక్కియ, వ్యవసాయ శాఖ జేడి ఎన్‌.విజరు కుమార్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు లంక ప్రసాద్‌, రాష్ట సలహా మండలి సభ్యులు త్రినాధరెడ్డి, వ్యయసాయ సలహ మండలి సభ్యులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.