Oct 16,2023 21:56

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి- పార్వతీపురం : సిపిఎస్‌ను, జిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 19 నుంచి యుటిఎఫ్‌ ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద నిరవధిక నిరాహారదీక్ష చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌రావు తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సుందరయ్య భవనంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోసిపిఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ తీసుకొచ్చిన ఉపాధ్యాయులను, ఉద్యోగులను మోసం చేశాడని అన్నారు. ఈనేపథ్యంలో సిపిఎస్‌ వద్దు - జిపిఎస్‌ వద్దు- ఒపిఎస్‌ కావాలి అనే నినాదంతో ఈనెల 18 నుండి రాష్ట్ర కేంద్రం విజయవాడలోనూ, ఈ నెల 19 నుంచి పార్వతీపురం మన్నం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో నిరవదిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీక్షలలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని, పాల్గొనని వారు శిభిరానికి వచ్చి మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌జిల్లా కోశాధికారి కె.మురళి, జిల్లా కార్యదర్ములు ఎన్‌.శ్రీనివాసరావు, పి.వెంకట నాయుడు, టి. శ్రీనివాసరావు, హరికృష్ణ పాల్గొన్నారు.