Nov 17,2022 22:08

ప్రజాశక్తి - ఏలూరు
             ఈ నెల 19వ తేదీ నుంచి సిఐటియు 12వ జిల్లా మహాసభ ఏలూరులో జరగనుందని, ఆ మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.సోమయ్య, డిఎన్‌విడి.ప్రసాద్‌ కోరారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 20 సంవత్సరాల తర్వాత ఏలూరులో సిఐటియు జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభ గురించి నెల రోజులకుపైగా ఏలూరు నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని తెలిపారు. సిఐటియు జిల్లా మహాసభ ప్రతి మూడు సంవత్సరాలకోసారి జరుగుతున్నాయని, గత మూడేళ్లలో జరిగినటు వంటి ఉద్యమాలను సమీక్షించుకుని భవిష్యత్తులో జిల్లాలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలపై చేపట్టాల్సిన కర్తవ్యాలను ఈ మహాసభలో చర్చిస్తామని తెలిపారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, కె.స్వరూపారాణి, ఆర్‌.నరసింహారావు, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.లింగరాజు, నగర అధ్యక్షులు బి.జగన్నాథరావు, కార్యదర్శి వి.సాయిబాబు, నాయకులు జె.గోపి, ప్రశాంత్‌ పాల్గొన్నారు.