ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టిఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఈ నెల 19, 20 తేదీల్లో విజయవాడలో జరగనున్నాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సోమేశ్వరరావు, సిహెచ్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని ఎం.బి.భవన్‌లో సోమవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య వ్యాపారీకరణ, ప్రైవేటీకరణను ఎస్‌ఎఫ్‌ఐ వ్యతిరేకిస్తుందన్నారు. విద్యా రంగ పరిరక్షణ, శాస్త్రీయ విద్యా విధానం, విద్యాహక్కు చట్టం అమలు, యూనివర్శిటీ గ్రాంట్స్ పెంపు, సంక్షేమ హాస్టల్స్ మౌలిక సదుపాయాలు, అద్దె భవనాల స్థానంలో సొంత భవనాల నిర్మాణానికి, పాఠశాలల్లో మౌలిక సదుపయాల ఏర్పాటుకు అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ విజయవాడ నగర నాయకులు మన్మధ, కుమారస్వామి, జాహ్ణవి తదితరులు పాల్గొన్నారు.
అన్ అకాడమీపై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా నడుస్తున్న అన్ అకాడమీపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు, కార్యదర్శి సిహెచ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న అన్ అకాడమీ ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపిసి గ్రూప్ క్లాసులు నడుపుతూ విద్యార్థుల దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్మధ, కుమారస్వామి, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.










