మాట్లాడుతున్న సిపిఎం నగర కార్యదర్శి
సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో
18న కార్పోరేషన్ ఎదుట మహాధర్నా
ప్రజాశక్తి-నెల్లూరు:సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 6 వ తేది నుంచి 15వ తేది వరకు 28 డివిజన్లలో నిర్వహించిన ప్రజా పోరు యాత్రలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 18వ తేదిన కార్పోరేషన్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం నగర కమిటీ కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం బాలాజీ నగర్ లోని సిపిఎం నగర కమిటీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర నియోజకవర్గంలో ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు పది రోజులు పాటు నగరంలోని 28 వార్డులలో గల అన్ని ప్రాంతాలలో వీధులలో పాదయాత్ర నిర్వహించి ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు. నగర నియోజకవర్గం పెన్నా నది ఒడ్డునే ఉన్నప్పటికీ మున్సిపల్ కొళాయిల్లో తాగేందుకు సురక్షితమైన మంచినీళ్లు సరఫరా చేయలేకపోతున్నారన్నారు. అనేక ప్రాంతాలలో కుళాయిలలో మురుగునీరు కలిసి కలుషితమై వాంతులు, విరోచనాలు డయేరియా వ్యాధి విజంభిస్తున్నదన్నారు. తగినంతమంది పారిశుద్ధ సిబ్బంది లేక అస్తవ్యస్తంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ తయారయ్యి ఉన్నదన్నారు. నెల్లూరు చెరువు నుండి నగరంలో వెళ్తున్న పంట కాలవలు వ్యర్ధాలతో నిండిపోయి దుర్గంధ భరితంగా తయారై ఉన్నాయన్నారు . దోమల ఉత్పత్తి కేంద్రాలుగా అంటువ్యాధులు, విషజ్వరాలు వ్యాప్తిచేసే కాలువలుగా ఇవి మారిపోయాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి ఇంటా,ప్రతి వీధి,ప్రతి నోటా మరో మాట వినపడిందన్నారు. పెరిగిన కరెంటు బిల్లులు తట్టుకోలేకపోతున్నామని, అదనపు చార్జీలు తోడవడంతో మరింత పరిస్థితి భారంగా తయారైందని తెలిపారన్నారు. ఇంటి పన్నులు పెంచి, అదనంగా చెత్త పన్ను వసూలు చేయడం సరైనచర్య కాదని అన్నారు. ప్రభుత్వమే కరెంటు చార్జీలు పెంచి మరలా కరెంటు బిల్లులకు సంక్షేమ పథకాలకు ముడిపెట్టి పింఛన్లు,రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారన్నారు. టిడ్కో గహాలలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జగనన్న ఇల్లు నాసిరకంగా నిర్మిస్తున్నారని, తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రజా పోరుయాత్ర దష్టికి తీసుకువచ్చిన సమస్యలపై ఆగస్టు 18వ తేదీ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వేలాదిమంది ప్రజలతో మహాధర్నా నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ మహా ధర్నాకు ప్రజలు తమ అర్జీలతో తరలిరావాలని పిలుపునిచ్చారు. నగర నియోజకవర్గ పరిధిలో సిపిఎం - ప్రజా పోరుయాత్ర జయప్రదం చేసిన నగర ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగేశ్వరరావు,షేక్ మస్తాన్, బి,పి.సూర్యనారాయణ, సిపిఎం నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ, కత్తి పద్మ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.వి రమణ పాల్గొన్నారు.










