ప్రజాశక్తి-దుగ్గిరాల:గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి మే 18న జరిగే ఛలో గుంటూరు కార్యక్రమంలో జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గుంటూరు జిల్లా గౌరవ అధ్యక్షులు వై నేతాజీ పిలుపునిచ్చారు. ఎస్.సురేష్ అధ్యక్షతన, మండలంలోని చిలువూరులో సోమవారం నిర్వహించిన యూనియన్ జిల్లా సమావేశంలో నేతాజి మాట్లాడుతూ గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి జీతాలను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. టెండర్ కార్మికులకు అనేకచోట్ల గత మూడు, నాలుగు ఏళ్లుగా జీతాల పెంపుదల చేయలేదని, పెరుగుతున్న ధరలతో పంచాయితీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, వీరందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా కోశాధికారి డి.వి.నరసింహారావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు ఏటా యూనిఫారం, గుర్తింపు కార్డులు, సబ్బులు, నూనెలు తదితర కనీస సౌకర్యాలు అమలు చేయాలని అన్నారు. జిల్లా నాయకులు పి శ్రీరాములు మాట్లాడుతూ పోరాటాలు చేయడం ద్వారానే ఏ కార్మికులైన సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారని గ్రామపంచాయతీ కార్మికులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.ప్రసాదు, బి.క్రీస్తుదాసు, ఎం జోసఫ్, కె.ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు










