ప్రజాశక్తి - కలెక్టరేట్ : ఆశా కార్యకర్తలకు పనిభారం తగ్గించాలని కోరుతూ ఈనెల 18న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు తెలిపారు. ఈ మేరకు ధర్నా వాల్‌పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర, కోశాధికారి జి.వెంకటరమణ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు పనిభారం తగ్గించాలని, సంబంధం లేని పనులు చేయించరాని, అధికారులు బెదిరింపులు, వేధింపులు ఆపాలని, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, టిఎ, డిఎ లు ఇవ్వాలని, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ధర్నాకు జిల్లాలోని ఆశా కార్యకర్తలంతా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.గౌరి, శివాని, త్రివేణి, భాగ్యలక్ష్మి, సుశీల, తదితరులు పాల్గొన్నారు.










