Jul 13,2023 21:52

డిమాండ్ల కరపత్రాలను విడుదల చేస్తున్న సిఐటియు నాయకులు, ఆశావర్కర్లు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 18న డిఎంహెచ్‌ఒ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా నాయకులు వి.ఇందిర తెలిపారు. గుమ్మలక్ష్మీపురంలో గురువారం ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్లతో సంబంధం లేని పనులు చేయించరాదన్నారు. నాసిరకం సెల్‌ఫోన్లు అందించడం వల్ల అవి సక్రమంగా పనిచేయడం లేదన్నారు. సిగల్స్‌ సమస్య ఉందని తెలిపారు. 14 రకాల యాప్‌లు డౌన్లోడ్‌ చేసుకోవాలని, 26 రకాల రికార్డులు రాయాల్సి ఉందని తెలిపారు. సెల్‌ఫోన్‌ పనిచేయకపోతే సొంత డబ్బులతోనే కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. రికార్డులు కూడా ఆశావర్కర్లే డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు. లేదంటే వేతనాలు కట్‌ చేస్తామని, ఉద్యోగం నుంచి తొలగిస్తామని వేధింపులు, బెదిరింపులు ఎక్కువ అయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నాణ్యమైన సెల్‌ఫోన్లు అందించాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ సెలవులు ఇవ్వాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కోలక అవినాష్‌, మండల నాయకులు పువ్వల తిరుపతిరావు, ఆశావర్కర్లు ఆరిక సుశీల, కె.శైలజ పాల్గొన్నారు.