ప్రజాశక్తి- అనకాపల్లి : పరవాడలో డిసెంబర్ 18, 19 తేదీల్లో జరిగే సిఐటియు అనకాపల్లి జిల్లా 12వ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో మహాసభల వాల్‌పోస్టర్లను సిఐటియు జిల్లా అధ్యక్షులు రుత్తల శంకరరావు, జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, కోశాధికారి వివి.శ్రీనివాసరావు ఆవిష్కరించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలకు జిల్లాలోని కార్మికులు, ఉద్యోగులు, అసంఘటితరంగ కార్మికులు, స్కీం వర్కర్లు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించాలన్నారు. కార్మిక సమస్యలు పరిష్కరించి, వారికి సౌకర్యాలను కల్పించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక హక్కులను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మిక ఉద్యమాలు, పోరాటాలపై నిర్బంధాన్ని ప్రయోగించడం బాధాకరమన్నారు. 11ఏళ్లుగా వేతన సవరణ జరగక, కనీస వేతనాలకు నోచుకోక జిల్లాలో మూడు లక్షల మంది కార్మికులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలలో పనిచేసే అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, ఐకెపి, గ్రామపంచాయతీ కార్మికులకు కనీస హక్కులు, ఉద్యోగభద్రత లేదని, దీనిపై రానున్న రోజుల్లో సిఐటియు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శి స్వరూపరాణి పాల్గొంటారన్నారు.










