ప్రజాశక్తి-విజయనగరం : ఓటర్ల సవరణ ప్రక్రియలో వచ్చిన ఫారం 6,7,8 లను వెంటనే ప్రాసెస్ చేయాలని, 10 నుండి 15 రోజుల మధ్య లో డిస్పోజ్ చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. 15 రోజులు దాటి పెండింగ్ ఉన్నవారికి నోటీసులను జారీ చేస్తామని అన్నారు. ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలతో శుక్రవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫారం 6,7,8 క్లెయిమ్ ల పరిష్కారం, ఓటర్లు జనాభా నిష్పత్తి, ఎపిక్ కార్డుల జనరేషన్, వార్తా పత్రికల్లో వచ్చిన ప్రతికూల వార్తల పై చర్యలు తదితర అంశాల పై సమీక్షించారు. దరఖాస్తులు అంది 30, 45 రోజులు దాటి పెండింగ్ ఉన్న ఫారాలను సోమవారం లోగా క్లియర్ చేయాలని ఆదేశించారు. రిజెక్ట్ కొట్టిన వాటికీ సహేతుకమైన కారణాలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు.
18, 19 సంవత్సరాల ఓటర్ల సంఖ్య జిల్లాలో తక్కువగా ఉందని, అర్హత గల యువకులు ఇంకా 6800 మంది ఉన్నారని, వారిని గుర్తించి ఓటర్లు గా చేర్పించాలని తెలిపారు. వచ్చే 10 రోజుల్లో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఓటర్ల తొలగింపు, నమోదు మరీ ఎక్కువగాను, తక్కువగాను ఉన్న చోట ఎఇఆర్‌ఒలు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని పర్యవేక్షించాలని తెలిపారు. వచ్చే వారంలో రోల్ అబ్జర్వరు శ్యామల రావు జిల్లాలో పర్యటించనున్నారని, బిఎల్‌ఒలు వారి వద్ద ఉన్న రిజిస్టర్ లన్నీ అప్‌డేట్ చేసుకోవాలని తెలిపారు. డిసెంబర్‌లో 2 రోజులు పాటు ఎన్నికల కమిషన్ అధికారులు జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్‌ఒ అనిత, ఇఆర్‌ఒలు వెంకటేశ్వర రావు, సుధారాణి, నూకరాజు , ఎన్నికల విభాగం ఎఒ శ్రీకాంత్, డిటిలు పాల్గొన్నారు.
18 ఏళ్ళు నిండిన వారందరిని ఓటర్లు గా చేర్పించాలి
అంతకు ముందు కలెక్టర్ వెబెక్స్ ద్వారా అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్ళ తో మాట్లాడుతూ , 18 ఏళ్ళు నిండిన యువతను ఓటర్లు గా చేర్చడానికి ఎన్నికల కమిషన్ 4 కట్ ఆఫ్ తేదీలను ఇచ్చిందని తెలిపారు. 1 జనవరి 2024 , 1 ఏప్రిల్ 2024, 1 జూలై 2024, 1 అక్టోబర్ 2024 నాటికీ 18 ఏళ్లు నిండుతున్న వారంతా ఓటర్లుగా చేరేందుకు అర్హులేనని, వారందరినీ గుర్తించి ఓటర్లు గా చేర్పించడానికి దరఖాస్తులను అందజేయాలని అన్నారు.