18 వరకు సాగునీరు అందిస్తాం : ఎస్‌ఇ
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్
మండలంలోని తెలుగు గంగ ఆయకట్టుకు ఈ నెల 18వ తేదీ వరకు సాగు నీరు అందిస్తామని తెలుగు గంగ ఎస్‌ఇ వెంకట రమణయ్య తెలిపారు. శనివారం నాడు తెలుగు గంగ ఆయకట్టు రైతులు పంటలు ఎండిపోతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా తెలుగు గంగ ఎస్‌ఇ వెంకట రమణయ్య, ఇఇ వెంకటేశ్వర్లు, డీఈలు వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, జై శివ నాయక్ వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ వెంకట రమణయ్య మాట్లాడుతూ సాగునీరు విడుదల చేస్తామని రైతులు క్రమశిక్షణతో ఒకరి తరువాత ఒకరు తమ పొలాలకు పెట్టుకోవాలని సూచించారు. పైన ఉన్న రైతులు కాలువలకు అడ్డం వేసి రోజుల తరబడి ఉంటే కింద సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడతారని గుర్తుంచుకో వాలని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలుగంగ వర్క్ ఇన్స్పెక్టర్లను పంపి సాగునీరు సజావుగా ప్రతి రైతు పొలానికి అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 3.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రామాపురం గ్రామానికి చెందిన రైతులు బాల సుంకన్న, మారాజు రాజు, బింగి వెంకటేశ్వర్లు, చిన్నరామయ్య, వాసుదేవ రెడ్డి, సఖిలే కృష్ణారెడ్డి, సంత జూడూరు గ్రామానికి చెందిన నడిపి ఎల్లయ్య, నాగేంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మురళి సర్పంచ్, ఎలగల రామచంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.










