Aug 11,2023 21:50

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* వాలంటీర్ల పాత్ర ఉండకూడదు
* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
జిల్లావ్యాప్తంగా చేపడుతున్న ఓటర్ల నమోదులో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వేను ఈ నెల 18వ తేదీ నాటికి శత శాతం పూర్తి కావాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో మున్సిపల్‌ కమిషనర్లు, ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 21న ప్రారంభమైన ఇంటింటి సర్వే ఈనెల 21వ తేదీతో ముగుస్తుందన్నారు. ఇప్పటివరకు యాప్‌లో 32 శాతం మాత్రమే సర్వే పూర్తయినట్లు నమోదైందని, మిగిలిన జిల్లాల్లో 80 శాతం వరకు పూర్తి చేశారని చెప్పారు. అందువల్ల జిల్లాలోనూ మిగిలి ఉన్న సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. యాప్‌లో సాంకేతికపరమైన లోపాలను సరిదిద్దుకుని పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజూ వేకువజామున, సాయంత్రం వేళల్లో యాప్‌ బాగా పనిచేస్తుందని, ఆ సమయాల్లో బిఎల్‌ఒలు పనిచేసి లక్ష్యాలను సాధించాలని సూచించారు. లక్ష్యాలను పూర్తి చేయడానికి పది రోజుల గడువు మాత్రమే ఉండడంతో పనిలో వేగం పెంచాలన్నారు. యాప్‌ పరంగా కొంత తక్కువగా నమోదు ఉన్నా, ఫిజికల్‌గా ఈనెల 18వ తేదీ నాటికి శతశాతం సర్వే పూర్తి కావాలన్నారు. సర్వే పరంగా టెక్కలి నియోజకవర్గం అన్నిటికంటే వెనుకంజలో ఉందని, అక్కడ 57 శాతం మాత్రమే సర్వే ఫిజికల్‌గా పూర్తి చేశారని చెప్పారు. సారవకోట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో సర్వే సక్రమంగా కావడం లేదన్నారు. సక్రమంగా పనిచేయని బిఎల్‌ఒలను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. సెలవు రోజుల్లోనూ సర్వే చేసి పూర్తి చేయాలన్నారు. గారలో 13 శాతం మాత్రమే సర్వే పూర్తయినట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తుందని, పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో జరిగిన 90 వేల తొలగింపు ఓటర్లను మరోమారు పరిశీలించాల్సి ఉందన్నారు. తొలగింపునకు తగిన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. డాక్యుమెంటేషన్‌ సరిగా లేని బిఎల్‌ఒలపై చర్యలు తప్పవన్నారు. శతశాతం పరిశీలన అనంతరం ఈనెల 28న బిఎల్‌ఒలు రిపోర్టులు సమర్పించాలన్నారు. 29న ఎఇఆర్‌ఒలు, 30న ఇఆర్‌ఒలు రిపోర్టులు సమర్పించాల్సి ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తప్పక పాటించాలని, జాబితాలు రూపొందించడంలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. బిఎల్‌ఒలతో పాటు వాలంటీర్ల పాత్ర ఎక్కడా కనిపించకూడదని, వారి సహకారం తీసుకున్నట్లు ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇఆర్‌ఒ, ఎఇఆర్‌ఒలు రాజకీయ పార్టీలతో సమావేశాలను నిర్వహించాలని సూచించారు. వారికి చేర్పులు, తొలగింపులు, మార్పుల వివరాలు అందజేసినట్లుగా సంతకాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.