Sep 30,2022 23:48

గ్రామ సభలో మాట్లాడుతున్న సర్పంచ్‌ పులి సంతోష్‌కుమార్‌

ప్రజాశక్తి -విఆర్‌.పురం
పోలవరం నిర్వాసిత గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కల్పించాలని శ్రీరామగిరి సర్పంచ్‌ పులి సంతోష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో నిర్వాసితుల సమస్యలపై శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. తహసీల్దార్‌ ఎన్‌.శ్రీధర్‌, జెడ్‌పిటిసి వి.రంగారెడ్డి, వైస్‌ ఎంపిపి భాగ్యలక్ష్మి, వార్డు మెంబర్లు పూసం రవివర్మ, గడ్డం సమ్మక్క, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. గ్రామాలు ఖాళీ చేశాక వీరంతా అనాధ కుటుంబాలుగా మారనున్నాయని చెప్పారు. భూమికి భూమి, భూమికి సర్వే చేయని భూములను తక్షణమే సర్వే చేయాలని, ఆర్‌ అండ్‌ ఆర్‌ జాబితాలో నమోదు కాని పిడిఎఫ్‌లను నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.