Sep 17,2023 11:24
  • మత మార్పిడులకు పాల్పడినందుకే అరెస్టు చేశామన్న తాలిబన్లు

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలను దూరం చేసిన తాలిబన్లు తాజాగా ఒక అంతర్జాతీయ ఎన్‌జిఒకు చెందిన 18 మంది సిబ్బందిని అరెస్టు చేశారు. వీరిలో ఒక అమెరికన్‌ మహిళ కూడా ఉన్నారు. దేశంలో సహాయం చేయడానికి వచ్చిన ఎన్‌జిఒ సిబ్బందిని అరెస్టు చేయడంతో తాలిబన్లపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాలయి. తమ సంస్థ సిబ్బందిని అరెస్టు చేసినట్లు ఇంటర్నేషనల్‌ అసిస్టెన్స్‌ మిషన్‌ (ఐఎఎం) ధ్రువీకరించింది. ఘోర్‌ రాష్ట్రంలో ఉన్న తమ కార్యాలయం నుంచి సిబ్బందిని అరెస్టు చేసి కాబూల్‌కు తరలించినట్లు తెలిపింది. ఎన్‌జిఒ సిబ్బందిని అరెస్టు చేసినట్లు తాలిబన్ల ప్రభుత్వ ప్రతినిధి కూడా అంగీకరించారు. ఐఎఎం బృందాన్ని తమ భద్రతా, ఇంటెలిజెన్స్‌ దళాలు కొంతకాలంగా గమనిస్తున్నాయని చెప్పారు. ఎన్‌జిఒ సిబ్బంది మత మార్పిడులకు పాల్పడుతున్న కారణంగానే వారిని అరెస్టు చేశామని తెలిపారు. ఈ ఆరోపణలను ఐఎఎం తీవ్రంగా ఖండించింది. తమ సంస్థ మత విలువల ఆధారంగానే స్థాపించబడినా ఎలాంటి రాజకీయ, మత విశ్వాసాల ప్రకారం సహాయం చేయదని, ప్రచారం చేయదని ఐఎఎం స్పష్టం చేసింది.