Sep 23,2023 22:51

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం సజావుగా పూర్తి చేసామని వచ్చే అక్టోబర్‌ 17వ తేదీన ముసాయిదా జాబితా ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ నగరం లోని వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ కేంద్రానికి సరిహద్దులు నిర్ధారించడం జరిగిందని, అందులో ఏ ఏ ఇంటి నెంబర్లకు సంబంధించిన ఓటర్లు ఉంటారనే విషయం స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. హేతు బద్దీకరణ ప్రకారం ఓటర్లను సమీపంలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లుగా ఉంచడం జరిగిందన్నారు. ప్రతి బూతు స్థాయి అధికారి ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా పరిశీలన చేశాక ఇల్లు ఉండి ఓటు లేని వారి పేర్లను, ఫారం 6 క్లేయిములను సేకరించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు వచ్చిన క్లేయిములన్నిటిని ఆన్లైన్‌ చేశామన్నారు. ఇల్లు ఉన్నచోట ఓటు లేకుండా వేరే చోట ఉన్నప్పుడు మార్పు గురించి ఫారం 8లో ఇవ్వమని బిఎల్‌ఓ కోరినప్పుడు ఓటరు బాధ్యతగా ఇవ్వాలన్నారు.ఎవరైనా బూతు స్థాయి అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించి తప్పు చేస్తే సస్పెండ్‌ చేస్తామని చెప్పారు. వచ్చే అక్టోబర్‌ 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని, దానిపై ఎవరైనా అభ్యంతరాలు ఉన్న మరల ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చేర్పులు మార్పులు ఉన్న సంబంధిత నమూనా ఫారాలలో క్లేయిము చేసుకోవచ్చన్నారు. జిల్లాలో కొత్తగా నమోదైన, తొలగింపు, మార్పులు చేర్పులైన ఓటర్ల జాబితా వివరాలను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందిం చామన్నారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ పి. వెంకటరమణ, మచిలీపట్నం ఆర్డిఓ శివ నారాయణ రెడ్డి వైఎస్‌ఆర్సిపి, టిడిపి, ఐఎన్సి, సిపిఎం, బిజెపి, బీఎస్పీ, జనసేన పార్టీల ప్రతినిధులు షేక్‌ సిలార్‌ దాదా ,ఐ దిలీప్‌ కుమార్‌, యశ్వంత్‌, బియంవి దాసు, చంద్రశేఖర్‌, సుబ్రహ్మణ్యం, పివి గజేంద్రరావు, పెగ్గం ప్రసాదరావు, వి చౌదరి, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం తహసిల్దార్‌ సురేష్‌, డిటి శ్యామ్‌ నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.