ఇజ్రాయిల్ దాష్టీకంతో అల్-షిఫా ఆస్పత్రి ఆవరణలోనే 179 మంది ఖననం!
ఆస్పత్రి పరిసరాల్లో శవాల దుర్వాసన
గాజా : ఇజ్రాయెల్ నిరంతరం దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న గాజా నగరంలో అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫాలో అమానుషమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత 72 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏడుగురు నవజాత శిశువులతో సహా 32 మంది రోగులు మరణించారు. దాడులు, ఆస్పత్రి చుట్టూ ఇజ్రాయిల్ బలగాల మోహరింపు కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి లేక చిన్నారులతో సహా 179 మృతదేహాలను ఆసుపత్రి ఆవరణలోనే సామూహిక ఖననం చేసినట్లు ఆస్పత్రి చీఫ్ మొహమ్మద్ అబు సాల్మియా మంగళవారం తెలిపారు. ఆస్పత్రికి నీరు, కరెంటు, ఔషధాల సరఫరా నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్పిటల్ సామూహిక సమాధిగా మారిందని మంగళవారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమందికి ప్రాణాలు పోయాల్సిన ఆసుపత్రి ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించడం వల్ల నేడు సమాధిగా మారిందని అన్నారు. మరికొన్ని మృతదేహాలు ఆసుపత్రి కాంప్లెక్స్‌లో పడి ఉన్నాయని చెప్పారు.
డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ ఆసుపత్రి పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని అన్నారు. ఆసుపత్రి నిర్వహణ కోసం ఇజ్రాయెల్ సైన్యం 300 లీటర్ల ఇంధనాన్ని అందించిందని ఆయన తెలియజేశారు. అయితే ఇది గంటకు కూడా సరిపోవడం లేదు. రోజుకు 8000 లీటర్ల ఇంధనం అవసరం. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, విద్యుత్, ఔషధాల కొరత కారణంగా అల్-షిఫా ఆసుపత్రిలో ఇప్పటివరకు 12 మంది రోగులు మరణించారు. ఇందులో ఇద్దరు నెలలు నిండని శిశువులు ఉన్నారు.
అల్-రాంటిసి, టర్కీ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 3000 మంది క్యాన్సర్ రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గాజాలోని 35 ఆసుపత్రుల్లో 23 పూర్తిగా మూతపడ్డాయి. ఐక్యరాజ్యసమితి పాఠశాలపై కూడా దాడి జరిగింది. గాజాలో ఇప్పటివరకు 12వేల మందికి పైగా మరణించినట్లు సమాచారం. అయితే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో కచ్చితమైన సమాచారం లభించడం లేదు. ఎక్కడికక్కడ మృతదేహాలు పడి వుండడంతో అవి కుళ్లిపోయి తీవ్రమైన దుర్వాసన వస్తోందని మీడియా వార్తలు పేర్కొన్నాయి. ఈ ఆసుపత్రిలో ఆది, సోమవారాల్లో వరుసగా 39 మంది, 36 మంది శిశువులు మృతి చెందినట్లు పిల్లల విభాగం డాక్టర్ మొహమ్మద్ తబాషా సోమవారం మీడియాకు తెలిపారు. గాజాలోని 35 ఆసుపత్రుల్లో 23 పూర్తిగా మూతపడ్డాయి. మిగిలిన ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య కార్యకర్తలు, రోగులను ఇజ్రాయెల్ సైన్యం బయటికి అనుమతించడం లేదని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గాజా నగరానికి పశ్చిమాన ఉన్న అల్-రిమాల్, తాల్ అల్-హవా, అల్-తుఫా, షేక్ అజ్లిన్ పరిసరాలు, బీచ్ శరణార్థి శిబిరంపై బాంబు దాడులు జరగగా, శరణార్థుల శిబిరంపై దాడిలో ఏడుగురు చనిపోయారు. ఐక్యరాజ్యసమితి పాఠశాలపై కూడా దాడి జరిగింది. గాజాలో ఇప్పటివరకు 11,360 మందికి పైగా మరణించినట్లు సమాచారం. అయితే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో కచ్చితమైన సమాచారం లభించడం లేదు. ఈ పరిస్థితుల పట్ల ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు గాజాలోని ప్రధాన ఆస్పత్రి అల్-షిఫాను హమాస్ కమాండ్ సెంటర్‌గా ఉపయోగిస్తున్నారన్న ఇజ్రాయిల్ ఆరోపణలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఇందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని హమాస్ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ఆస్పత్రి క్రింద సొరంగం!
గాజా నగరంలోని చిల్డ్రన్స్ రాంటిసి ఆసుపత్రిలో హమాస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని సోమవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దాడికి పాల్పడిన ఆసుపత్రి కింద సొరంగంలో హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను కనుగొన్నట్లు ఐడిఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మ్ డేనియల్ హగారి మీడియాతో తెలిపారు. ఆసుపత్రి నుండి సైనికులపై కాల్పులు జరిపిన వారిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ వీడియో ద్వారా పేర్కొంది.
గాజాపై హమాస్ పట్టు కోల్పోతోంది : ఇజ్రాయెల్
గాజాపై హమాస్ పట్టు కోల్పోతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మీడియాతో చెప్పారు.