Oct 20,2023 09:24

న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో దేశంలో పేదరికం ఏమాత్రం తగ్గలేదు. 2018లో ఏ స్థాయిలో ఉన్నదో గత సంవత్సరం కూడా అదే స్థాయిలో ఉన్నదని ప్రపంచబ్యాంక్‌ తాజా నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం 2018లో 15 కోట్ల 17 లక్షల మంది భారతీయులు పేదరికంతో అలమటించగా, 2019లో ఆ సంఖ్య 17 కోట్ల 60 లక్షలకు పెరిగింది. అంటే ఆ సంవత్సరంలో పేదల సంఖ్య సుమారు 2 కోట్ల 40 లక్షలు పెరిగిందన్న మాట. 2018లో పేదరిక రేటు 11.09% ఉంటే 2021లో 11.9%గా నమోదైంది. 2020లో చాలా ఎక్కువగా అంటే 14.72%గా ఉంది. కేంద్ర ప్రభుత్వం వద్ద 2011-12 నుండి కుటుంబ వినియోగదారుల వ్యయ సర్వే (సిఇఎస్‌) సమాచారం అందుబాటులో లేదు. మన దేశంలో పేదరికానికి సంబంధించిన అంచనాల కోసం 'సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ' సంస్థ పైనే ప్రపంచబ్యాంక్‌ ఆధారపడింది. 2022-23, 2023-24కు సంబంధించిన సిఇఎస్‌ల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. 2017-18లో ప్రభుత్వం ఇలాంటి సర్వేని జరిపినప్పటికీ బహిర్గతం చేయలేదు. బయటికి పొక్కిన సమాచారం ప్రకారం గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 2018లో గరిష్ట స్థాయికి చేరింది. కోవిడ్‌కు ముందు 2018-19లో పేదరికం పెరగడానికి అనేక కారణాలున్నాయని ఒకప్పటి ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌సి సక్సేనా చెప్పారు. ప్రభుత్వం 2017-18లో నిర్వహించిన వినియోగ సర్వే ప్రకారమే పేదరికం పెరిగింది. 2005-15 మధ్యకాలంలో నిర్మాణాలలో పెట్టుబడులు బాగా పెరిగాయి. 2015 తర్వాత అవి తగ్గిపోయాయి. వాస్తవ వేతనాలలో పెరుగుదల లేదని గణాంకాలు చెబుతున్నాయి. కార్మికుల సంఖ్య కూడా పెద్దగా పెరగలేదు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగాలు లేకపోవడమో లేదా వారు ఉద్యోగాల కోసం వెదకడమో జరిగింది. మన దేశంలో 2019లో అత్యంత పేదలుగా ఉన్న వారి సంఖ్యకు సంబంధించి తాను వేసిన అంచనాలను ప్రపంచబ్యాంక్‌ సవరించింది. కడు పేదరికాన్ని అనుభవిస్తున్న వారి సంఖ్యను 13 కోట్ల 68 లక్షలుగా చూపిన ప్రపంచబ్యాంక్‌, ఆ తర్వాత దానిని సవరించి 17 కోట్ల 60 లక్షలుగా నమోదు చేసింది. కోవిడ్‌ కారణంగా 2020లో ఐదు కోట్ల 60 లక్షల మంది భారతీయులు అత్యంత పేదరికంలో మగ్గిపోయారు.