Jan 22,2023 23:45

ఆందోళన చేస్తున్న గిరిజన సంఘం నేతలు

ప్రజాశక్తి కొయ్యూరు : గిరిజనులు పోరాడి సాధించుకన్న 1/70 చట్టాన్ని తొలగించాలని తెలంగాణ, భద్రాదిగూడెం జిల్లా గిరిజనేతరులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ, కొయ్యూరు మండల గిరిజన సంఘం నాయకులు మండల కేంద్రంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సరుమూర్తి సూరిబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని భూములు, అడవులు, అన్నింటిపైనా సర్వహక్కులు ఆదివాసీలవేనన్నారు. 1/70 చట్టాన్ని ఆదివాసులు పోరాటం ద్వారా సాధించుకున్నారన్నారు. ఐదో షెడ్యూల్లో గిరిజనేతరులకు హక్కులు ఉండవని, సమత జడ్జిమెంట్‌లో సుప్రీంకోర్టు తీర్పును మర్చిపోకూడదని గుర్తు చేశారు, ఆదివాసులు పోరాటాలకు తలొగ్గి భూ బదలాయింపు చట్టాన్ని చేశారన్నారు. ఇపుడు ఆ చట్టాన్ని తొలగించాలని పిటిషన్‌ దాఖలు చేయడమంటే, గిరిజనుల హక్కులు కాలరాయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే అనంతగిరి చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు చేస్తున్నాయని, గిరిజన చట్టాలు, హక్కులను కాలరాసి, ఆదానీ, షిరిడీసాయి వంటికార్పొరేట్‌ కంపెనీలను మన్యంలోని సొత్తును దారాధత్తం చేసేందుకుజరుగుతున్న కుట్రలో భాగమే హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు నిర్మాణమని, దీన్ని గిరిజన సంఘం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గిరిజనులు, వివిధ ప్రజాసంఘాలు ,మేథావుల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై అప్పలనాయుడు, గిరిజన సంఘం నాయకులు గూడెం లక్ష్మణరావు, టిడిపి ఎస్‌టి సెల్‌ నేత ఎంవివి ప్రసాదు, కొయ్యూరు సర్పంచ్‌ మాకాడ బాలరాజు, యువజన నాయకులు ఈరోజు బుజ్జిబాబు, కుమార్‌, గిరిజన సంఘం సభ్యులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.