ప్రజాశక్తి- పాచిపెంట : నాలుగున్నరేళ్ల వైసిపి హయాంలో పాచిపెంట మండలంలో 45,768 మంది లబ్ధిదారులకు 170.35 కోట్ల రూపాయలు పలు సంక్షేమ పథకాల ద్వారా అందించామని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర తెలిపారు. మండలంలోని కొటికిపెంట పంచాయతీ కొత్తవలస గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. అయినా, ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా డబ్బులు ఇచ్చిన వారికే పథకాలు అందజేసేవారని, రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో సాలూరుకు అత్యధిక నిధులు మంజూరు చేసి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. గడపగడపకు కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, డోల బాబ్జి, సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు, టి.గౌరీశ్వరరావు, జి.ముత్యాలనాయుడు, చంద్రునాయుడు, మధుసూదన్‌రావు, ఎంపిడిఒ జి.పార్వతి, తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలోని పెద్దపొల్ల సచివాలయ పరిధిలోని మర్రిమానుగూడ, గడిగుజ్జి, సీడిమనుగూడ, చాపరాయిగూడ, వెలగాపురం, నాయికమ్మగూడ, చిన్నపొల్ల, పెద్దపొల్ల, పొల్లకాలనీ, కొత్తవలస, ఉమ్మ గెడ్డ గ్రామాల్లో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వి.కళావతి చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ ఒక వైపు సంక్షేమ పథకాలతో, మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజా రంజక పరిపాలన సాగిస్తున్నట్లు తెలిపారు. గత టిడిపి రాక్షస పాలనలో ప్రభుత్వ సేవల విషయంలో ఎటువంటి అవసరాలున్నా ప్రజలను లంచాలతో జన్మభూమి కమిటీలు పట్టి పీడించేవన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు తెలుసుకుని, తక్షణమే పరిష్కరించారు.










