Jan 22,2023 23:23

తరలి వచ్చిన నాయకులు, గిరిజనులు

ప్రజాశక్తి -హుకుంపేట:1/70 చట్టంను పటిష్టంగా అమలు జరిగేవరకు ఉద్యమం ఆగదని అఖిలపక్షం నేతలు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రం లోని గిరిజన సంఘం కార్యాలయంలో అఖిల పక్షం నాయకులు, వైస్‌ ఎంపీపీ కొండల అధ్యక్షతన ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ, గిరిజనేతరుల అక్రమ నిర్మాణదారులపై ఎల్‌టిఆర్‌ కేసులు నమోదు చేయాలని, వీటిని కూల్చి వేయాలని డిమాండ్‌ చేశారు. ఆ కూల్చి వేసిన స్థలాలను గిరిజన పేదలకు, నిరుద్యోగ యువకులకు పంచి పెట్టాలన్నారు. భినామిల పేరుతో ఉన్న నిర్మాణాలు స్వాధీన పరచుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై చర్చించి వీటినీ అమలు పరచడానికి అఖిల పక్షం కమిటీ ఏర్పాటు చేశామన్నారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధి కోసం షాపులు కట్టుకోవడానికి స్థలలు కేటాయించాలని పలుమార్లు రెవిన్యూ కార్యాలయంలో వినతిపత్రాలు ఇచ్చినా స్పందించక పోవడం దారుణమన్నారు. ముందుగా గిరిజన సంఘం కార్యాలయం నుండి ప్రధాన నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ చేశారు. నాలుగు రోడ్ల కూడలిలో మానవ హారం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి లక్ష్మణ్‌రావు, డిఎల్‌ఓ రాష్ట్ర అధ్యక్షులు రంజిత్‌ కుమార్‌, టిడిపి నాయకులు తులసీరావు, బీఎస్పీ నాయకులు రాంబాబు, గాసన్న, గిరిజన సంఘం అధ్యక్షుడు రామారావు, మాజీ జీసీసీ చైర్మన్‌ శెట్టి లక్ష్మణుడు, వైసీపీ నాయకులు ఎంపీటీసీలు సత్తిబాబు,సాంబ, సర్పంచ్‌లు పాడి పోతురాజు, పూజారి సుబ్బారావు, డి వెంకటరావు, టీడీపీ అరుకు అసెంబ్లీ ఎస్‌టి సెల్‌ కార్యదర్శి కొర్రా సంతోష్‌ కుమార్‌, బిఎస్‌పి నాయకులు పూజారి రాంబాబు, జనసేన నాయకులు రాజు, సాయిబాబా, గిరిజనులు పాల్గొన్నారు.