ప్రజాశక్తి - బుట్టాయగూడెం
సుప్రీంకోర్టులో ఉన్న 1/70 చట్టంకేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని గిరిజనుల పక్షాన వాదనను వినిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కెఆర్‌పురం ఐటిడిఎ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లం రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఎ.రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి గిరిజన చట్టాలపై దాడులు పెరిగాయన్నారు. 1/70 చట్టం సుప్రీంకోర్టులో వేశారని దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి గిరిజనుల పక్షానవాదన వినిపించాలని కోరారు. ఇప్పటికే అటవీ హక్కుల చట్టం 2006, జిఒ మూడు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం నీరు కార్చారని, ఐదో షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, చట్ట సవరణకు కొంతమంది గిరిజనేతరులు ప్రభుత్వ అండతో కేసులు వేయిస్తున్నారని విమర్శించారు. అటవీ హక్కుల చట్టం 2006 చట్ట ప్రకారం గిరిజనులకు పోడుభూములకు పట్టాలివ్వాలని అనేక దఫాలుగా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో పట్టాలు నేటికీ అందలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన చట్టాలకు రక్షణగా నిలబడాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇళ్ల స్థలాలు లేని గిరిజనులకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు నాగేంద్ర, రమేష్, మడివి దుర్గారావు, చొడెం దుర్గమ్మ, పోలోజు నాగేశ్వరావు, బి.చంద్రం. చుండ్రు బుల్లమ్మ, కారం భాస్కరరావు పాల్గొన్నారు.










