Aug 14,2023 00:24

యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

ప్రజాశక్తి అరకులోయ రూరల్‌:మండల కేంద్రంలో రోజురోజుకు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా గిరిజనేతరులు చేపడుతున్నా పంచాయతీ అధికారులు, రెవిన్యూ అధికారులు పట్టించకో లేదు. గిరిజనేతరుడైన చికెన్‌ సెంటర్‌ యాజమాని చెల్లయ్య కుమారుడు మండల ప్రజా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు రహీమ్‌ తుల్లా షేక్‌ నాలుగు రోడ్ల కూడలి ఎదురుగా పంచాయతీ, రెవెన్యూ అనుమతులు లేకుండా దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.కో ఆప్షన్‌ మెంబర్‌ అధికారంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అండ దండలు ఉన్నాయని బహిర్గతంగా చర్చిస్తున్నారు. అంతేకాకుండా పంచాయతీ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దర్జాగా నిర్మాణాలు చేపడుతుడటం గమనార్హం. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేపడుతున్నా పంచాయతీ, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంలో అంతర్యం ఏమిటని స్ధానికులు మండిపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం, పీసా చట్టం అమలులో ఉన్నప్పటికీ ఈ చట్టాలను అతిక్రమించి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారనే విమర్శనాలు బలంగా వినిపిస్తున్నాయి.గిరిజన హక్కులు, చట్టాలు అమలు చేయావలసిన ప్రభుత్వ అధికారులే గిరిజనేతరులకు కొమ్ముకాస్తే చట్టాని రక్షించేది ఎవ్వరని గిరిజన ప్రజాసంఘాలు, ప్రజా సంఘాలు స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. గిరిజనులు రోజువారి జీవనాధారం కోసం చిన్నపాటి రేకులు, షెడ్డులు నిర్మించి వ్యాపారాలు చేసుకుంటున్నా వారిపై మాత్రం అధికారులు ఆగమేఘాలపై వచ్చి ఆ షెడ్డులను తొలగిస్తున్నారని అదే గిరిజనేతరులు బహుళ అంతస్తులు, శాశ్వత నివాస గృహలు, లాడ్జిలు(వసతి గృహాలు) నిర్మాణం చేస్తుంటే మాత్రం అధికారులు చూసి చూడనట్టు వ్యహరిస్తున్నారు.అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఎల్‌టిఆర్‌ కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.