ప్రజాశక్తి గాజువాక : 'రాష్ట్రాన్ని రక్షించండి - దేశాన్ని కాపాడండి' అనే నినాదంతో ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు తెలిపారు. పెదగంట్యాడలోని పోతిన సన్యాసిరావు భవన్‌లో సిపిఐ గాజువాక నియోజకవర్గం సర్వ సభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన ఉదయం 9 గంటలకు కూర్మన్నపాలెం కూడలిలోని ఉక్కు దీక్షా శిబిరం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ బస్సు యాత్రను సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్జీత్ కౌర్ ప్రారంభిస్తారని తెలిపారు. బస్సు యాత్రలో సిపిఐ రాష్ట్ర నాయకత్వం పాల్గొంటుందని చెప్పారు. ఎంఎస్.అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, నాయకులు జె.రామకృష్ణ, జి.ఆనంద్, పల్లేటి పోలయ్య, కె.అచ్యుతరావు, అప్పారి విష్ణుమూర్తి, కె.పోతన్న, పి.దుర్గారావు, మహిళా నాయకులు కె.వనజాక్షి, పిల్లా సూర్యపద్మ పాల్గొన్నారు.










