కనీసం ఇక్కడైనా రెండు విషయాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఈ రెండు అంశాలూ పిల్లలను మానసికంగా హాయిగా ఉంచేందుకు తోడ్పడేవి. మొదటిది లలితకళలకు సమయాన్ని, అవకాశాన్ని ఇవ్వడం. సంగీతం, పెయింటింగ్, నాటకాలు, డాన్సు...లో మార్కులు వేయడంగాని, పోటీ గాని ఉండవు గనుక ఒత్తిడి ఉండదు. పైగా తొందరగా కోలుకోవడానికి, చురుకుదనం పెంచడానికి ఈ కళలు తోడ్పడతాయి. రెండవది బోధనాంశాలకు సంబంధించినది. పాఠ్యపుస్తకాలలోని సిలబస్‌ను మొత్తాన్ని ఏదో ఒక విధంగా కవర్ చేయాలని భావించరాదు. ఇందుకోసం కొంతమంది సబ్జెక్టు నిపుణులను, కొంతమంది ఉపాధ్యాయులను కలిపి కూర్చోబెట్టి అన్ని స్థాయిల సిలబస్‌నూ చర్చించి... ఈ అసాధారణ పరిస్థితికి అనుగుణంగా ఉండేలా మార్పులు చేయాలి.
గతంలో ఎన్నడూ ఇంత సుదీర్ఘకాలం పాటు స్కూళ్ళు మూతబడడం జరగలేదు. ఇంత విరామం తర్వాత మళ్ళీ ఇప్పుడు బడులు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు పాఠాలు చెప్పడం గతంలో రొటీన్‌గా చెప్పుకుపోయినంత తేలిక కాదని గుర్తించిన ఉపాధ్యాయులు ఉన్నారు. మరికొంతమంది మాత్రం 'ఎక్కడ ఆగిపోయామో తిరిగి అక్కడి నుంచి మొదలుపెట్టడమే కదా' అనుకుంటున్నారు. నిజానికి కొందరు అప్పుడే మొదలుపెట్టేశారు కూడా. అంటే ఆన్‌లైన్ క్లాసుల్లో ఎంతవరకూ సిలబస్‌ని పూర్తిచేశారో, అక్కడి నుంచి ఇప్పుడు క్లాసుల్లో కొనసాగిస్తున్నారన్నమాట. బైట ప్రపంచంలో ఏం జరిగిందో, దాని పర్యవసానాలు ఏమిటో వాటితో నిమిత్తం లేకుండా 'నేను నా సబ్జెక్టుకి, పూర్తి చేయవలసిన సిలబస్‌కి పరిమితం అవుతాను. ఏదోవిధంగా దానిని పూర్తి చేస్తాను' అని, తమకు నిర్దేశించిన సబ్జెక్టుని పిల్లలకు ఎక్కించడమే తమ పని అని అనుకునే ''సబ్జెక్ట్'' టీచర్లు ఉన్నారు. పిల్లలకు పరీక్షల్లో వచ్చే మార్కులే వారి విజయానికి కొలబద్ద అని, ఆ విధంగానే వాళ్ళు జీవితంలో కూడా విజయాలను సాధిస్తారని నమ్మేవాళ్ళు ఈ తరహా టీచర్లు. దీనినే తమ లక్ష్యంగా పెట్టుకుంటారు గనుక వారు ఆ పిల్లల వ్యక్తిగత జీవితాలను గాని, వారనుభవించే భావోద్వేగాలను గాని పట్టించుకోరు. వారి దృష్టిలో బోధన అంటే పాఠ్యపుస్తకాలలో వివరించిన సిలబస్‌ను పిల్లల మెదళ్ళ లోకి ఎక్కించడమే. ఈ విధంగా భావించే ఉపాధ్యాయులే మెజారిటీగా ఉన్నారని చెప్పవచ్చు.
మరికొంతమంది ఉపాధ్యాయులు, మైనారిటీగానే ఉన్నప్పటికీ, విద్య అంటే కేవలం సిలబస్ ను పూర్తి చేసి, పిల్లలను పరీక్షలకు సిద్ధం చేయడమే కాదని, అంతకు మించి కూడా ఉన్నదని భావించేవారు ఉన్నారు. ఒక ఉపాధ్యాయుని విజయం అతడు లేదా ఆమె తన పిల్లలతో ఏవిధమైన బాంధవ్యం పెంచుకోగలుగుతారు అన్న దానిపైన ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. వారు ఏ సబ్జెక్టు బోధిస్తారన్నది ప్రధానం కాదు. అందువల్లనే ఈ తరహా ఉపాధ్యాయులు ఆ పిల్లల మానసిక, భావోద్వేగ స్థితి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ తాపత్రయ పడతారు. ఒక విద్యార్థి గనుక నలతగా ఉంటే ఆ విద్యార్థికేమైందని వాకబు చేస్తారు. ఒక్కో విద్యార్థికీ ఉండే వ్యక్తిగత ప్రత్యేకతలను బట్టి, వారి వారి మానసిక ప్రవృత్తిని బట్టి, ప్రవర్తనను బట్టి వాటికి తగ్గట్టు వ్యవహరిస్తారు. అటువంటి ఉపాధ్యాయులు స్కూలు వెలుపలి ప్రపంచంలో ఏం జరుగుతున్నదో పరిశీలిస్తారు. దాని ప్రభావం విద్యార్థుల మీద ఏ విధంగా పడుతున్నదో గమనిస్తారు. తాము వారికి బోధించే విషయాల పట్ల ఉత్సాహం ప్రదర్శిస్తున్నదీ, లేనిదీ, పాఠ్యాంశాల పట్ల ఆ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నదీ, లేనిదీ చూస్తారు. అటువంటి ఉపాధ్యాయులకు ఈ దీర్ఘకాల వ్యవధి ఒక పెద్ద ఆటంకంగా మారింది. పిల్లలతో రోజువారీ ఉండిన బాంధవ్యానికి ఈ గ్యాప్ ఒక పెద్ద బ్రేక్ వేసింది. తిరిగి బోధన ప్రారంభించడానికి అడ్డుగా తయారైంది. ఏకంగా 17 నెలలపాటు క్లాసులకు రాకుండా, ముఖాముఖి పిల్లలతో కాలం గడపకుండా ఉండడం వలన దాని ప్రభావం అటు పిల్లల పైనే కాకుండా, ఇటు ఉపాధ్యాయులపై కూడా పడింది.
గ్యాప్ ప్రభావం
ఇప్పుడు మనం ఎక్కువగా ''లెర్నింగ్ లాస్'' గురించి వింటున్నాం. ఐతే దీని పూర్తి అర్ధం చాలామందికి ఇంకా బోధపడినట్టు లేదు. ఇంతకీ దేనిని మనం లెర్నింగ్ లాస్ అని అంటున్నాం? ఈ 17 నెలల గ్యాప్ రావడానికి ముందు ఏ స్థాయిలో చదవడం, రాయడం చేయగలిగేవారో ఇప్పుడు అదే స్థాయిలో తిరిగి మొదలుపెట్టలేకపోతే అదే లెర్నింగ్ లాస్ అని గనుక ఎవరైనా అనుకుంటే అది తప్పు. అసలు లాస్ అని, గెయిన్ అని పిల్లలు చదివే చదువు విషయంలో మనం మాట్లాడుకోవడం అంటేనే అది తప్పు. ఆ పదాలు పిల్లల విద్యాభ్యాసానికి వర్తించవు గాక వర్తించవు. పిల్లలు చిన్నతనంలో నేర్చుకున్నదానిలో చాలా భాగం మరిచిపోతారు. ఆ నేర్చుకున్నదానిని రోజువారీ జీవితంలో ఉపయోగిస్తూంటేనే అది వారికి గుర్తుంటుంది. కేవలం చదివినాగాని గుర్తు పెట్టుకోవడం విషయంలో మాత్రమే కాదు, గ్రహించడం, విశ్లేషించడం, నిర్ధారించడం వంటి సామర్ధ్యాలు కూడా రోజూ ఆచరణతో ముడిపడి వున్నప్పుడే నిలబడతాయి. ఈ ఆచరణలో గ్యాప్ వచ్చినప్పుడు తేడా వస్తుంది. అంతకుముందు ఉన్న సామర్ధ్యం ఆ గ్యాప్ తర్వాత వెంటనే మళ్ళీ ఆటోమేటిక్‌గా తిరిగి పునరుద్ధరించబడదు. మళ్ళీ ఆచరణతో లింకు ఏర్పడినప్పుడు తిరిగి పాత సామర్ధ్యం పునరుద్ధరణ జరుగుతుంది. ఐతే భయం భయంగా, స్కూలుకి వస్తే ఏమౌతుందో అని అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు అనుకుంటూ ఉన్న వాతావరణంలో పాత పరిస్థితులు వెంటనే పునరుద్ధరించబడతాయా ?
అందుచేత ఈ పరిస్థితులను గమనంలో ఉంచుకోకుండా ఏదోవిధంగా గ్యాప్‌ను పూర్తి చేసేయాలన్న తొందరతో ఉపాధ్యాయుడు వ్యవహరిస్తే, అసహనం ఏర్పడుతుంది. అది విద్యార్థి పరిస్థితిని మరింత జటిలం చేసేస్తుంది. మన దేశంలో చాలామంది ప్రజలకు ఉపాధ్యాయులు ఎటువంటి ఒత్తిడులను ఎదుర్కొంటారో దానిపై సరైన అవగాహన లేదు. కొంతమంది ప్రిన్సిపాళ్ళకే అర్ధం కావడంలేదు. ఇక పిల్లల తల్లిదండ్రుల సంగతి చెప్పాలా? మంచి ర్యాంకులు తెచ్చుకోవాలన్న వత్తిడి చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయస్సుల విద్యార్థులపైనా ఉంటుంది. ఒక బిడ్డ స్కూలులో అడుగు పెట్టిన మొదటి రోజు నుండే ఇది ప్రారంభమౌతుంది. విద్యాభ్యాస ప్రారంభ సంవత్సరాలలో పిల్లల ఎదుగుదలకు ఇది పెద్ద ఆటంకం. ఐతే ఈ సంగతి చాలామంది ఉపాధ్యాయులకే తెలియదు. తెలిసిన వారు తక్కువమంది కావడంతో వారు ఎక్కువమంది మీద ప్రభావం చూపలేకపోతున్నారు. ఇంకొక పక్క సమాజంలో విస్తృతంగా నెలకొన్న పోటీ సంస్కృతి ఆ పిల్లల్ని స్కూలులో మొదటి నెల నుంచే మరింత బాగా చదవాలని, మరిన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఒత్తిడి పెంచుతూనే వుంటుంది.
ప్రస్తుత కోవిడ్-19 వలన ఏర్పడిన గ్యాప్ తర్వాత క్లాసురూముల్లో పిల్లల మీద ఈ ఒత్తిడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుందన్న అనుమానం ఉంది. చాలామంది పిల్లలు లెక్కలు చేసేటప్పుడో, స్పెల్లింగులు చెప్పేటప్పుడో, ఫార్ములాలు గుర్తుకు తెచ్చుకునేటప్పుడో వెనకబడతారు. గ్యాప్‌ను పూడ్చాలన్న ఒత్తిడితో గనుక ఉపాధ్యాయులు వ్యవహరిస్తే ఆ ఒత్తిడి మరింత పెరిగిపోయి దుర్భరమౌతుంది. పిల్లవాడు వెనకబడ్డాడు అనగానే వాడికి అదనంగా ట్యూషన్‌లు పెట్టించడం, ఎక్కువ మోతాదులో హోం వర్కు ఇచ్చి చేయించడం పరిపాటి. అసలే ఒత్తిడికి లోనవుతున్న పిల్లవాడు ఇటువంటి చర్యల వలన మరింత నరకాన్ని అనుభవిస్తాడు.
ముందుగా దీర్ఘకాలం పాటు కోవిడ్-19 నియంత్రణలకు లోబడి ఉండిపోయిన పిల్లలు తమ బాల్యంలో కోల్పోయిన అపురూప కాలాన్ని, ఆ నష్టం యొక్క ప్రభావాన్ని ప్రతీ పిల్లవాడి విషయంలోనూ ప్రత్యేకంగా పరిశీలించాలి. ఆన్‌లైన్ చదువు నేర్చుకున్నవారు, ఆ సౌకర్యం పొందలేకపోయినవారు-రెండు రకాలూ ఉంటారు. మళ్ళీ ఆ ఆన్‌లైన్ చదువుకు అలవాటుపడి నేర్చుకోగలిగినవారు కొందరైతే ఆ తరహా చదువు పద్ధతి సరిపడనివారు మరికొందరు. ఇన్ని తేడాలనూ ఉపాధ్యాయుడు చూడగలగాలి. తిరిగి క్లాసురూము లోకి అడుగుపెట్టిన విద్యార్థి మీద ఆ ప్రభావం ఏవిధంగా ఉందో అంచనా వేయాలి.
ఆన్‌లైన్ చదువుల ప్రభావం
డిజిటల్ చదువు దానితోబాటు ఆ విద్యార్ధులకు కొన్ని అలవాట్లను వ్యసనాలుగా అంటించింది (వీడియో గేమ్స్, చాటింగ్ వంటివి కొన్ని). ఇప్పుడు క్లాసురూమ్‌కి తిరిగి వచ్చాక తన స్వేచ్ఛ కోల్పోయినట్టు భావించవచ్చు. ఆన్‌లైన్ చదువు కొనసాగించాడు గనుక ఆ పిల్లలు ఏ విధమైన గ్యాప్ లేకుండా సిలబస్‌ను పూర్తి చేసేయగలరని అనుకుంటే అది పొరపాటే ఔతుంది.
ఆన్‌లైన్ చదువు కొద్దిమందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దానిని పొందగలిగినవారికి కూడా ఆ చదువు వలన కలిగిన ప్రయోజనం పరిమితమే. ''క్లాసులో చెప్పే బదులు ఆన్‌లైన్‌లో చెప్తున్నారంతే. పెద్ద తేడా ఏమీ లేదు'' అని అనుకోవడం చాలా పొరపాటు. ''ఆన్‌లైన్ లో చెప్పడం కన్నా వేరే ఏం చేయగలరు?'' అని అనుకున్నా అదీ పొరపాటే. షాపింగ్ మాల్స్ తెరవడానికి ఇచ్చిన మొదటి ప్రాధాన్యత స్కూళ్ళను తెరవడానికి ఎందుకు ఇవ్వలేదు? విద్యకు ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యతను ఇచ్చిందో దీనిని బట్టే గ్రహించవచ్చు. చాలా ఇతర దేశాల్లో ఇందుకు భిన్నంగా స్కూళ్ళను యథావిధిగా నడపడానికి సాధ్యమైనంత ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మరే ఇతర దేశంలోనూ మన దేశంలో మాదిరిగా స్కూలు టీచర్లకు ఎయిర్‌పోర్టుల దగ్గర, వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర డ్యూటీలు వేయలేదు. పాఠాలు చెప్పడం సాధ్యపడలేదు సరే. మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఎందుకు నిలిపివేశారు? దాని పర్యవసానంగా పిల్లల్లో కలిగిన ఆకలి, పోషకాహార లేమి కలిగించిన నష్టం ఎంతో అంచనా వేయగలరా? కోవిడ్ తర్వాత చదువులే మానుకున్న పిల్లలు ఎంతమందో ఇంకా అంచనా వేయనేలేదు. మరి ఆ నష్టం మాటేమిటి ?
దక్షిణాది రాష్ట్రాలలో చదువుల పరిస్థితి తక్కిన దేశంలో కన్నా కాస్త మెరుగు. కనీసం ఇక్కడైనా రెండు విషయాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఈ రెండు అంశాలూ పిల్లలను మానసికంగా హాయిగా ఉంచేందుకు తోడ్పడేవి. వీటికి తగిన ప్రాధాన్యతనిస్తే ఇటు పిల్లలకు, అటు ఉపాధ్యాయులకు కూడా కొత్త పరిస్థితులకు తొందరగా అలవాటు పడడానికి తోడ్పడతాయి.
మొదటిది లలితకళలకు సమయాన్ని, అవకాశాన్ని ఇవ్వడం. సంగీతం, పెయింటింగ్, నాటకాలు, డాన్సులో...మార్కులు వేయడంగాని, పోటీ గాని ఉండవు గనుక ఒత్తిడి ఉండదు. పైగా తొందరగా కోలుకోవడానికి, చురుకుదనం పెంచడానికి ఈ కళలు తోడ్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు స్కూళ్ళు ఇందుకోసం కొంత వనరులను సమకూర్చగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
రెండవది బోధనాంశాలకు సంబంధించినది. 'ఎక్కడ ఆగిపోయామో అక్కడే తిరిగి మొదలుపెట్టి పూర్తి చేయాలి' అనే వైఖరి ఎంతమాత్రమూ పనికిరాదు. పాఠ్య పుస్తకాల లోని సిలబస్‌ను మొత్తాన్ని ఏదో ఒక విధంగా కవర్ చేయాలని భావించరాదు. ఇందుకోసం కొంతమంది సబ్జెక్టు నిపుణులను, కొంతమంది ఉపాధ్యాయులను కలిపి కూర్చోబెట్టి అన్ని స్థాయిల సిలబస్‌నూ చర్చించి...ఈ అసాధారణ పరిస్థితికి అనుగుణంగా ఉండేలా మార్పులు చేయాలి.
(కృష్ణకుమార్ గతంలో ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌గా వ్యవహరించారు. 'ది హిందూ' వ్యాసానికి స్వేచ్ఛానుసరణ)
కృష్ణకుమార్











