Jul 14,2023 21:43

ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ గోసల రాఘవరెడ్డి

16న ఉచిత కంటి వైద్యశిబిరం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు నియోజకవర్గం ఎఎస్‌పేట మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రం బిల్డింగ్‌లో 16వ తేదీ నుంచి నిర్వహించే ఉచిత కంటి వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు, నాటా (నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) మాజీ అధ్యక్షులు డాక్టర్‌ గోసల రాఘవరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని ఓ ప్రయివేట్‌ కళ్యాణ మండలంలో మీడియా సమావేశం నిర్వహించి వైద్యశిబిరానికి సంబంధించిన వివరాలను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నైకు చెందిన శంకర నేత్రాలయ కంటి వైద్యశాల వారి సహకారంతో డాక్టర్‌ గోసల రాఘవరెడ్డి, డాక్టర్‌ గీతాంజలి కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉచిత వైద్యశిబిరం 11 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి శుక్లం ఉన్న వారికి మాత్రమే కంటి పొర ఆపరేన్‌ నిర్వహిస్తారని, ఈ ఆపరేషన్లు 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరుగుతాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వాహనంలో ప్రభుత్వం అనుమతించిన శంకర నేత్రాలయ కంటి ఆసుపత్రి వారితో ఎఎస్‌పేటలోని రైతు భరోసా కేంద్రం బిల్డింగ్‌లో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చికిత్స కోసం వచ్చే వారికి ఆపరేషన్‌, ఐఒఎల్‌ లెన్సు, కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందజేస్తామన్నారు. బీపీ, షుగర్‌, ఇతర వ్యాధులు ఉన్నవారు కంటి చికిత్స కోసం వచ్చే సమయంలో వాళ్లు వాడే మందులు తప్పనిసరిగా తీసుకెళ్లాలని, కంటి చికిత్స జరిగిన తరువాత 2 గంటల్లో ఇంటికి వెళ్లవచ్చని తెలిపారు. ఈ చికిత్సకు ఎటువంటి నగదు వసూలు చేయించాల్సిన అవసరం లేదని, పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చికిత్స కోసం వచ్చే వారు తప్పనిసరిగా ఫోన్‌ నెంబరు, ఆధార్‌ కార్డు జెరాక్స్‌లతో హాజరుకావాలని కోరారు. అందరూ ఈ ఉచిత వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసిపి ఎఎస్‌పేట మండల జెసిఎస్‌ కో ఆర్డినేటర్‌ పులిమి వెంకట రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్‌ గోసల రాఘవరెడ్డి తమ కుటుంబసభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రజలందరికి ఉపయోగపడే విధంగా ఈ కంటి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు గోసల శ్రీనివాసులరెడ్డి తదితరులున్నారు.