
ప్రజాశక్తి -యంత్రాంగం
గాజువాక : జివిఎంసి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 16వ తేదీన చేపట్టే నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పారావు, గణేష్ పిలుపునిచ్చారు. గాజువాక సిఐటియు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జివిఎంసి అధికారులతో జరిగిన ఒప్పందాన్ని ఆగస్టు 31లోగా అమలు చేస్తామని చెప్పినా నేటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో నీటి సరఫరా, యుజిడి, వెటర్నరీ, మలేరియా, పారిశుధ్యం, ఎంఎస్‌ఎఫ్, క్లాప్ డ్రైవర్లతోపాటు అన్ని సెక్షన్ల కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. నగర ప్రజల సేవలకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటుచేయాలని, 300 పోస్టుల అమ్మకాలపై దర్యాప్తు చేయాలన్న డిమాండ్లతో సమ్మెకు వెళ్తున్నట్లు చెప్పారు.
సమ్మెకు సిద్ధంకండి
కలెక్టరేట్ : సమస్యలను జివిఎంసి అధికారులు పరిష్కరించనందున తప్పని పరిస్థితుల్లో నీటి సరఫరా, యుజిడి, వెటర్నరీ, మలేరియా, పారిశుధ్యం, ఎంఎస్‌ఎఫ్, క్లాప్ డ్రైవర్లుతోపాటు అన్ని సెక్షన్ల కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు ఈ నెల 16 నుంచి సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం బుచ్చిరాజుపాలెం 24వ బ్లాకు నీటి సరఫరా, యుజిడి కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి నాయుడు అధ్యక్షత వహించారు.