Oct 19,2023 22:01

ప్రజాశక్తి - ఏలూరు
       జిల్లాలో జగనన్న చేదోడు పథకం కింద వరుసగా నాలుగో ఏడాది జిల్లావ్యాప్తంగా 16,486 మంది రజక , నాయీబ్రాహ్మణ, దర్జీలకు రూ.16.49 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూరిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు చెప్పారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు రూ.325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని సిఎం జగన్‌ కర్నూరు జిల్లా ఎమ్మిగనూరు వేదికగా ఈ పథకం ద్వారా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, బిసి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పుష్పలత, జిల్లా బిసి సంక్షేమాధికారి ఆర్‌.నాగరాణి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ఏలూరు జిల్లాకు చెందిన 16,486 లబ్ధిదారులకు రూ.16.49 కోట్ల డెమో చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో జగనన్న చేదోడు కింద షాపులున్న రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా చింతలపూడి నియోజకవర్గంలో 2,258 మంది లబ్ధిదారులకు రూ.1.15 కోట్లు, దెందులూరు నియోజకవర్గంలో 2,343 మంది లబ్ధిదారులకు రూ.1.20 కోట్లు, ఏలూరు నియోజకవర్గంలో 2,377 మందికి రూ.83.50 లక్షలు, కైకలూరు నియోజకవర్గంలో 1,159 మందికి రూ.1.16 కోట్లు, నూజివీడు నియోజకవర్గంలో 3,303 మందికి రూ.1.82 కోట్లు, పోలవరం నియోజకవర్గంలో 3,683 మందికి రూ.1.95కోట్లు, ఉంగుటూరు నియోజకవర్గంలో 1,291 మందికి రూ.1.19 కోట్లు, గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలంలో 72 మందిరకి రూ.39.70 లక్షలు మంజూరు చేశారని తెలిపారు.