May 22,2023 22:19

నాలుగేళ్లలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన ముఖ్యమంత్రి జగన్‌
మినీ మహానాడులో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చన్నాయుడు
ప్రజాశక్తి - కాళ్ల

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 160 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని పెదఅమిరంలో తెలుగుదేశం పార్టీ జిల్లాస్థాయి మినీ మహానాడు సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన సాగుతుందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులపై, సంస్థలపై దాడులు చేయడం, జైల్లో పెట్టడం వంటి పనులు పనులతో పాలన సాగిస్తున్నారన్నారు. వైసిపికి అధికారం ఇచ్చి ప్రజలు అతిపెద్ద తప్పు చేశారన్నారు. కోడి కత్తి కేసు, బాబారు హత్యలను సానుభూతిగా చూపి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ కక్షసాధింపు ధోరణిలో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతిని జగన్‌ చిధ్రం చేశారన్నారు. విద్యుత్‌, ఆర్‌టిసి, ఇంటి పన్ను, చెత్తపన్ను రూపంలో ప్రజల నుంచి రూ.మూడు లక్షల కోట్లను వసూలు చేసిందని ఆరోపించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు కొంత అన్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వారికి రాజ్యాంగబద్ధమైన పదవులు ఇస్తామని చెప్పారు. ఒకప్పుడు అన్నింట్లో ప్రథమ స్థానంలో ఉండే రాష్ట్రం ఇప్పుడు అట్టడుగున ఉందన్నారు. ఈ ముఖ్యమంత్రి కోసం తాను చెప్పనక్కర్లేదని, ప్రస్తుత మంత్రులు ధర్మాన, బొత్స వైసిపిలోకి రాక ముందే జగన్‌ ఏమిటో చెప్పారన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగితే మళ్లీ అరాచక పాలనే వస్తుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వారమవుతామని అన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు విషయంలో సిబిఐ అధికారులు కూడా భయపడే పరిస్థితి ఎందుకని, కర్నూలు ఆసుపత్రిలో ఇతర రోగుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఎపిలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదని కర్నూలులో పరిస్థితి చూస్తే అర్థమవుతుందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 34 స్థానాలు గెలుస్తామని టిడిపి జోన్‌-2 ఇన్‌ఛార్జి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జనసేన పార్టీతో పొత్తుతో అన్ని స్థానాలూ గెలిచి తీరుతామన్నారు. ఎన్‌టిఆర్‌ పార్టీ పెట్టిన రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే ఇప్పడూ ఉన్నాయన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నమైందని విమర్శించారు. టిడిపిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. గ్రామాల్లో మౌలిక సమస్యలు పరిష్కరించలేని వైసిపి ప్రభుత్వం పేదలపై బాదుడు కార్యక్రమాన్ని తలపెట్టిందని విమర్శించారు. బిజెపి ద్వంద్వ వైఖరి మార్చుకోవాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో బిజెపి నాయకులు జగన్‌ ప్రభుత్వంపై ఒకవైపు ఛార్జిషీట్లు నమోదు చేస్తూ.. మరోవైపు అవినాష్‌రెడ్డి అరెస్టు విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తూ ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. మీడియాపై అవినాష్‌ గూండాలు నిత్యం దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బారుబారు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఎ.షరీఫ్‌, ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎంఎల్‌ఎలు వివి.శివరామరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్‌రావు, నేతలు పొత్తూరి రామరాజు, వలవల బాబ్జి, ముత్యాల రత్నం, ముళ్లపూడి బాపిరాజు, కోళ్ల నాగేశ్వరరావు, పాతూరి రామచౌదరి, వీరవల్లి చంద్రశేఖర్‌, పాలి ప్రసాద్‌ పాల్గొన్నారు.