Jun 13,2023 23:20

కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు

ప్రజాశక్తి- అనకాపల్లి
జిల్లాలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలలో విధులు నిర్వహించుచున్న 160 మంది జర్నలిస్టులకు సంబంధించి అక్రిడిటేషన్‌ ప్రతిపాదనలను ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ చైర్మన్‌ రవి పఠాన్‌ శెట్టి తెలిపారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో మంగళవారం కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంబంధించిన విషయాలను చర్చించినట్లు చెప్పారు. అందులో భాగంగా త్వరలో అక్రిడిటేడ్‌ జర్నలిస్టులకు వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి చర్యలు చేపట్టవలసినదిగా వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజేష్‌ను ఆదేశించారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయని జర్నలిస్టులు, ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్‌ 38, తేదీ 30-3-2023ను అనుసరించి దరఖాస్తు చేసుకొని, వాటిని జిల్లా పౌర సంబంధాల కార్యాలయానికి అందజేయాలని సూచించారు. అంతకు ముందు అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కె.చంద్రరావు, వి.లోవరాజు, కె.చంద్రశేఖర్‌, ఎస్‌కె.చాంద్‌బాష, టి.రమేష్‌, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ కెవివిఎస్‌ఎన్‌.రాజేష్‌, కార్మిక శాఖ, ఆర్‌టిసి, రైల్వే, హౌసింగ్‌ అధికారులు, కన్వీనర్‌ మెంబరు కె.ఇంద్రవతి తదితరులు పాల్గొన్నారు.