ప్రజాశక్తి - పార్వతీపురం : ఇవిఎంల మొదటి దశ తనిఖీలు ఈనెల 16 నుండి ప్రారంభమవుతుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు పునశ్చరణ, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాలెట్ యూనిట్ 3250, కంట్రోల్ యూనిట్లు 2560, వివిపాట్ లు 3170 కేటాయించారని అందులో ఒక వివిపాట్ మినహా మిగిలినవి జిల్లాకు చేరాయని చెప్పారు. వీటి మొదటి దశ తనిఖీలు ఈనెల 16 నుంచి ప్రారంభమవుతుందని, తనిఖీలు ప్రతి రోజూ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆయా రోజుల్లో పార్టీల ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. ఈనెల 27న సమీకృత ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుందని వివరించారు. ఈనెల 27 నుంచి డిసెంబరు 9 వరకు క్లైమ్స్, అభ్యంతరాలు స్వీకరణ జరుగుతుందని, డిసెంబరు 26 నాటికి వాటిని పరిష్కరిస్తామని ఆయన అన్నారు. జిల్లాలో కొత్తగా ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిపారు. జిల్లాలో 1024 పోలింగ్ కేంద్రాలుండగా, కొత్తగా ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. 26 పోలింగ్ కేంద్రాల లొకేషన్ మార్పుకు, 32 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పుకు కూడా ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 15 నుంచి అక్టోబరు 3 వరకు 18088 ఓట్లు చేర్చామని, 20236 ఓట్లు తొలగించామని, 63965 ఓటర్ల వివరాల్లో మార్పులు చేర్పులు చేసినట్టు తెలిపారు.
ఫారం - 6 కింద 20,027 దరఖాస్తులు అందగా 473 తిరస్కరించామని, 18088 మందిని ఓటరు జాబితాలో చేర్చినట్టు తెలిపారు. వీటిలో 1191 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫారం-7 కింద 24031 దరఖాస్తులు అందగా 1380 దరఖాస్తులు తిరస్కరించగా, 20,236 మందిని ఓటరు జాబితాలో చేర్చగా, 1664 పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఫారం-8 కింద 73343 దరఖాస్తులు అందగా, 814 తిరస్కరించగా, 63965 మందిని ఓటరు జాబితాలో చేర్చామని, ఇంకా 4738 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.










