ప్రజాశక్తి-మధురవాడ : వాణిజ్య విద్యను అభ్యసించే విద్యార్థులలో నాయకత్వ లక్షణాలతో పాటు క్రీడా, సాంస్కృతిక నైపుణ్యాలను వెలికి తీయడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం బిజినెస్ స్కూల్ ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజులపాటు గీతం ఎక్సలెన్స్ మీట్ -23 (జెమ్) ను నిర్వహించనున్నట్లు కార్యక్రమ సిఇఒ, ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ షేక్ షంషుద్దీన్ తెలిపారు. జెమ్-23 సన్నాహకాలలో భాగంగా గీతం ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలను గీతం క్రికెట్ స్టేడియంలో బిజినెస్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ అమిత్ భద్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా రాష్ట్రాల నుంచి వివిధ విద్యా సంస్థలకు చెందిన 26 జట్లు ఈ పోటీలలో పాల్గొంటున్నాయని డాక్టర్ షేక్ షంషుద్దీన్ తెలిపారు. క్రికెట్ పోటీలతో పాటు వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్ బాల్ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో వాణిజ్య అంశాలపై వర్క్ షాప్‌లు, సమకాలిన కార్పొరేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళపై చర్చలు, విద్యార్థుల ఫ్యాషన్ షో, రాక్ బాండ్, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో జెమ్ -23 నిర్వాహక బృంద సభ్యులు, సీనియర్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.