ప్రజాశక్తి-పాడేరు:ఐటీడీఏ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 15వ రోజుకు చేరాయి. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ కే.త్రినాధరావు దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 15 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలన్నారు. దీక్షలకు సంపూర్ణంగా మద్దతిస్తున్నామని, ప్రత్యక్ష పోరాటాల్లో భాగస్వాములు అవుతామని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తెలిపారు. గిరిజన విద్యార్థుల వరస మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తక్షణమే హెల్త్ అసిస్టెంట్‌లను ఆశ్రమాల్లో నియమించాలని కోరారు. గిరిజన ఆశ్రమ విద్యార్థుల మరణాలు అరికట్టేందుకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు. గిరిజనులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన ప్రజా ప్రతినిధులపై గౌరవం లేని పాడేరు ఐటీడీఏ పిఓను తక్షణమే సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. పెదబయలు తహసీల్దార్ ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని, బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ కూడ రాధాకృష్ణ. చిన్నారావు, టి.చిరంజీవి, పి.ప్రకాష్, బత్తిరి నరేష్, గిరిజన సంఘం నాయకులు రాందాస్ పాల్గొన్నారు.










