Jul 12,2023 23:56

మాట్లాడుతున్న ధూళిపాళ్ల నరేంద్ర

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగించాలని నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన దీక్ష 15 రోజులకు చేరుకుంది. బుధవారం దీక్షను పెదనందిపాడు మండల పరిషత్‌ మాజీ అధ్యక్షులు నర్రా బాలకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. పెదనందిపాడు హై లెవెల్‌ ఛానల్‌ తవ్వుతామని అనేక దశాబ్దాల నుండి హామీలు ఇస్తున్నా అమలుకు నోచుకోవట్లేదన్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, పర్చూరు మండలాల్లో భూగర్భ జలాలు లేవని, అందువల్ల సాగు, తాగునీరు కావాలంటే గుంటూరు ఛానలే మార్గమన్నారు. గుంటూరు ఛానల్‌ పొడిగించాలంటే భూసేకరణ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. అందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కె.కోటయ్య, నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్‌ కె.రాజమోహన్‌, డి.హరిబాబు, ఎన్‌.సుబ్బారావు, వై.అంకమ్మచౌదరి, ఎం.సౌరిబాబు పాల్గొన్నారు.