Nov 29,2022 23:50

సమావేశంలో పాల్గొన్న డిపిఒ కొండలరావు, అధికారుల, పంచాయతీ కార్యదర్శులు

జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి

15వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయితీలలో పారిశుధ్య నిర్మూలన, తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు అన్నారు. సోమవారం స్థానిక సచివాలయం వద్ద రాజవొమ్మంగి, అడ్డతీగ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు చిత్తశుద్ధితో పనిచేయాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అల్లూరి జిల్లాలోని 430 పంచాయతీలకు 2021- 22 ఆర్థిక సంవత్సరానికి రూ.2.15 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘంలో టైడ్‌ నిమిత్తం రూ.13.98 కోట్లు నిధులు విడుదల చేయగా వాటితో పారిశుధ్యం, తాగునీరు వంటి వాటికి మాత్రమే ఉపయోగించాల్సి ఉందన్నారు. బేసిక్‌ నిమిత్తం రూ.8.7 కోట్లు విడుదల చేయగా ఇందులో సిసి రోడ్లు, డ్రైన్లు, ఇతర మరమ్మతులు చేపట్టుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో 993 మంది గ్రీన్‌ అంబాసిడర్లు పనిచేస్తున్నారని, వీరికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ వరకు రూ.2.22 కోట్లు వేతనం చెల్లించినట్లు చెప్పారు. జిల్లాలో 399 చెత్త సంపద కేంద్రాలు మంజూరయ్యాయని, మరో 31 మంజూరు కావాల్సి ఉందని తెలిపారు. అనంతరం రాజవొమ్మంగి పంచాయితీలో పారిశుధ్య నిర్వహణకు తగినంత సిబ్బంది లేరని, పంచాయతీకి ఒక జెసిబి మంజూరు చేయాలని స్థానిక సర్పంచ్‌ గొల్లపూడి రమణి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఎల్‌పిఒ ఎన్‌.వివేక్‌, ఇఒపిఆర్‌డి వి.వెంకట శ్రీనివాసరావు, లబ్బర్తి ఎంపీటీసీ గొల్లపూడి పెద్దిరాజు, పంచాయతీ కార్యదర్శి ఆకుల మల్లేశ్వరరావు పాల్గొన్నారు.