ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: గ్రామ పంచాయతీలకు రావలసిన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు బాపట్ల జిల్లాలోని సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు, బాపట్ల జిల్లాలోని సర్పంచులు ఉయ్యూరు అప్పిరెడ్డి, శొంఠి శ్రీనివాస రావు, టి కృష్ణమోహన్, ఏ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు విడుదల కావలసిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంతవరకు విడుదల కాకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు, పార్టీలకతీతంగా సర్పంచులందరూ ఉద్యమించాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,010 కోట్లు బాకీ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉందని, వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా యూనియన్ బ్యాంక్ అకౌంట్స్ గ్రామపంచాయతీ వాళ్లు పీఎంఎఫ్‌ఎస్ లింకు ఉన్న ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా వేస్తేనే తాము నిధులు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుందన్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోని సర్పంచ్‌లు కొంతమంది కలిసి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కలిస్తే ఈ మేరకు తెలపడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గ్రామ పంచాయతీలు పట్ల ప్రేమతో వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరాహార దీక్షలు, రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా సర్పంచ్‌లందరూ కలిసి నిరాహార దీక్షలు చేస్తామని అన్నారు. అలాగే వేసవి వస్తున్న నేపథ్యంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఎక్కువ గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద గ్రామ పంచాయతీలో గ్రీన్ గార్డ్, గ్రీన్ అంబాసిడర్‌లు ఏర్పాటు చేశారని, వారికి కేంద్ర ప్రభుత్వం సంవత్సర కాలం నుంచి జీతాలు వేయటం లేదని, వెంటనే జీతాలు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు అన్ని పంచాయతీల ఆధ్వర్యంలోనే నడవాలని, సచివాలయంలో వచ్చే ఆదాయాన్ని గ్రామపంచాయతీల అకౌంట్లో వేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహసంగా ప్రారంభించిన గడప గడపకూ నిధులు గ్రామపంచాయతీ ఆధీనంలోనే ఖర్చు చేయాలని కోరారు. గతంలో కూడా సర్పంచ్‌లకు తెలియకుండానే కరెంట్ బిల్లుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు నిధులు లాక్కున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కరెంట్ బిల్లుల పేరుతో సర్ చార్జీల వసూలు ఆపాలని, మైనర్ పంచాయతీల కరెంట్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. పై సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు అందరం గ్రామాల్లోని ప్రజల సహకారంతో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లాలోని పలువురు సర్పంచులు దాది వెంకటలక్ష్మి, సుబ్బారావు, బి అనిల్ కుమార్, పి బాజీ, కూచిపూడి రత్నకుమారి, భాను, కె ఆనందబాబు, రుద్రపాటి శోభారాణి, కె లక్ష్మి కామేశ్వరావు, లక్ష్మీ తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.










