ప్రజాశక్తి - రేపల్లె
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ ఈనెల 15నుంచి ప్రారంభమౌతుందని తహసిల్దార్ మల్లికార్జునరావు అన్నారు. తన కర్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. వలంటీర్లు ఇళ్లను సందర్శించి ప్రజలకు ఆరోగ్యసురక్షపై అవగాహన కల్పించాలన్నారు. యాప్‌లో కుటుంబ ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఏఎన్‌ఎం, సీహెచ్‌సీ వైద్యాధికారులు సందర్శించే తేదీలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఈనెల 30నుంచి నిర్వహించే వైద్య శిబిరాల్లో గ్రామ, పట్టణప్రాంతాల్లో వ్యాధిగ్రస్తులకు మూత్ర, రక్త తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు. అవసరమైతే రెఫరల్ ఆస్పత్రికి పంపి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తారని చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు, పీహెచ్‌సీ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ద్వారా చికిత్స, మందులు ఉచితంగా అందించబోతోందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి విజయసారథి, ఎంపీడీవో కె శివ పార్వతి, ఈఓపిఆర్డి కెఎస్ మల్లికార్జునరావు, డిప్యూటీ తహశీల్దారు సత్యనారాయణ పాల్గొన్నారు.










