Aug 27,2023 22:18

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
          అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్‌ చేసిన తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ వచ్చేనెల 15వ తేదీన విజయవాడలో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బివి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలోని స్ఫూర్తి భవన్‌లో అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, రాజకీయపక్షాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు యర్రా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రశేఖర్‌ మాట్లాడుతూ లక్షలాదిమంది చిరువ్యాపారులు, బడుగు జీవులు, దిగువ, మధ్యతరగతి కుటుంబాలు రెక్కలుముక్కలు చేసుకుని సంపాధించిన డబ్బులు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా అగ్రిగోల్డ్‌ కంపెనీలో దాచుకున్నారని తెలిపారు. సంస్థ బోర్డు తిప్పేయడంలో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అగ్రిగోల్డ్‌ బాధితులు 230 మంది ఆత్మహత్య చేసుకున్నారని, వీరికి అప్పటి ప్రభుత్వం రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించారన్నారు. ఆనాటి ప్రతిపక్ష నాయకులు, ప్రస్తుత సిఎం జగన్‌ తాను అధికారం చేపట్టిన ఏడు రోజుల్లో బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లయినా బాధితుల సమస్యను పరిష్కరించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమసమస్యల పరిష్కారం కోసం వీధి పోరాటాలు, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. నాలుగేళ్ల కాలంలో అగ్రిగోల్డ్‌ బాధితులు 600 మంది ఆత్మహత్య చేసుకున్నారని మరణించిన కుటుంబాలకు రూ.ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో జరిగే ధర్నాలో అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య మాట్లాడుతూ ఇప్పటివరకూ అనేకమంది ఏజెంట్లు, డిపాజిట్‌దారులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. బాధితులపై ముఖ్యమంత్రి జగన్‌ చాలానిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శించారు. పాలకులు సరైన దిశగా ఆలోచన చేసి బాధితులుగా ఉన్న 19.5 లక్షల మందికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. డిపాజిట్‌ సొమ్ము అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ కంటే తక్కువగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని అందరికీ న్యాయం చేయాలన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితులు నేటి వరకూ 600 మంది మరణించారని, మిగిలిన వారు జీవచ్ఛవాలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిందని, రాష్ట్రంలో వైసిపి, కేంద్రంలో బిజెపి బాధ్యత తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ కేవలం సంక్షేమ పథకాల బటన్‌ నొక్కడం కాదని, అగ్రి గోల్డ్‌ బాధితుల సొమ్ము చెల్లించడానికి కూడా బటన్‌ నొక్కాలన్నారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ చేస్తున్న పోరాటాలకు సిపిఎం అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఏకమై బిజెపిని నిలదీయాలన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను రాహుల్‌ గాంధీ దృష్టి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో బిజెపి నాయకులు నాగం శివ, జనసేన నాయకులు శ్రావణ్‌కుమార్‌ గుప్తా, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా నాయకులు సిహెచ్‌.జగన్మోహనరావు, ఎవి.రాంబాబు, షేక్‌ మస్తాన్‌, శివ ప్రసాద్‌, సూర్యనారాయణ, సత్యనారాయణ, అడ్డగర్ల లక్ష్మి ఇందిర ప్రసంగించారు. తొలుత ఇటీవల మరణించిన అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ శివలెంక వెంకటభవానిశారద మృతికి సమావేశం సంతాపం తెలిపింది.