
ప్రజాశక్తి-సోమందేపల్లి : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతల్లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ విజయవాడలో చేపట్టనున్న 'ప్రజారక్షణభేరి' బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రా లను విడుదల చేశారు. పెద్దన్న మాట్లాడుతూ సిఎం జగన్ కార్పొరేట్ సేవలో తరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్రాన్ని ప్రశ్నించకపోగా వారు చెప్పినట్టు తలాడిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, ఆస్తి, చెత్త పన్ను, ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారన్నారు. 'నవరత్నాలు' తప్ప నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, గిట్టుబాటు లేని వ్యవసాయం, రక్షణ కరువైన చేతువృత్తులు, కౌలురైతులు ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. పైగా విద్యుత్ ఛార్జీలు, ఇసుక ధరలు పెంచి ఉపాధిని దెబ్బతీస్తుందన్నారు. వైసిపి పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, నిరసనలు తెలియజేయడానికి వీలులేకుండా నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు, బైండోవర్ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి కూడా కేంద్రంపై పల్లెత్తు మాట అనకపోగా పార్లమెంటులో బిజెపిని బలపరుస్తుందన్నారు. ప్రమాదంలో పడిన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలన్నా, సామాన్యులకు ఊరట లభించాలన్నా ప్రజలు ఐక్యంగా కదలాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక ప్రధాన కూడలిలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, సహాయ కార్యదర్శి వెంకటేష్, కొండా వెంకటేష్, బెస్త కిష్టప్ప, కె.కృష్ణప్ప, శీలా నారాయణస్వామి, మాబు, నాగభూషణ, సంజీవప్ప, తదితరులు పాల్గొన్నారు.