Nov 04,2023 22:24

ప్రజాశక్తి - అత్తిలి
          విజయవాడలో ఈ నెల 15న ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్‌ పిలుపునిచ్చారు. శనివారం మండలంలో రేలంగి, కె.సముద్రపుగట్టు, అత్తిలి, మంచిలి గ్రామాల్లో ప్రజారక్షణ భేరి ప్రచార జాతాను మండల కన్వీనర్‌ కె.రాంబాబు, నేతలు స్వాగతం పలికారు. జోరు వర్షంలో ప్రచార జాతా సాగింది. ఈ జాతాలో జిల్లా నాయకులు ఆకుల హరేరామ్‌, నేతలు బత్తుల విజయకుమార్‌, ధర్మేంద్ర, ఎం.సురేష్‌, పంపన లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
పెనుమంట్ర: సిపిఎం ప్రజా రక్షణ భేరి ప్రచార యాత్ర శనివారం మండలంలో సాగింది. నత్తా రామేశ్వరం, మాముడూరు, పొలమూరు, పెనుమంట్ర, భట్లమగుటూరు, ఆలమూరు, మార్టేరు మీదుగా సాగింది. పలుచోట్ల సిపిఎం జిల్లా నేత ఆకుల హరేరాం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి తిరుమల, తోట శ్రీను, పోతు శ్రీను, పి.నాగేంద్ర, శివగణేష్‌, కె.నరేష్‌, కేతా ప్రమోద్‌ పాల్గొన్నారు.
భీమవరం: ధరలను అదుపు అదుపు చేయకుండా.. నిరుద్యోగం పెంచడమే కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బిజెపి, వైసిపిలను గద్దె దింపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.వాసుదేవరావు పిలుపునిచ్చారు. సిపిఎం ప్రజారక్షణ భేరి ప్రచార యాత్ర శనివారం పట్టణంలో సాగింది. లంకపేట, ప్రకాశం సెంటర్‌, మావుళ్లమ్మ సెంటర్‌, మున్సిపల్‌ కాలనీ, వైఎస్‌ఆర్‌ కాలనీల మీదుగా జాతా సాగింది. ఈ సందర్భంగా వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు జవ్వాది శ్రీనివాస్‌ మాట్లాడుతూ వెంటనే టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బి.కళ్యాణి, ఎం.వైకుంఠరావు, షేక్‌ వలీ, బి.చైతన్యప్రసాద్‌, డి.త్రిమూర్తులు, బి.శ్రీరాములు, భార్గవ పాల్గొన్నారు.
తణుకు రూరల్‌: రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపి విష కౌగిలి నుండి వైసిపి, టిడిపి, జనసేన బయటకు వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పివి.ప్రతాప్‌ అన్నారు. శనివారం ప్రజారక్షణ భేరి జిల్లా యాత్ర కప్పల వెంకన్న, మున్సిపల్‌ కార్యాలయం, నరేంద్ర, వెంకటేశ్వర, వేల్పూర్‌, రేలంగి సెంటర్ల మీదుగా సాగింది. ఈ సందర్బంగా ప్రతాప్‌, అజయకుమారి, కామన మునిస్వామి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు గార రంగారావు, గుబ్బల గోపీ, పి.శ్రీను, నాగేంద్ర, పెద్దిరాజు, కడలి వీర్రాజు, నర్సింహారావు, వెంకటేశ్వరరావు, సత్తిబాబు పాల్గొన్నారు.
మొగల్తూరు: కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జవ్వాది శ్రీనివాస్‌ విమర్శించారు. ప్రజారక్షణభేరి ప్రచార యాత్ర గాంధీబొమ్మ సెంటర్‌ మీదుగా సాగింది. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి నేతలు చైతన్య ప్రసాద్‌, షేక్‌ వలీ ఆలపించిన గీతాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో యడ్ల చిట్టిబాబు, కొత్త విజయకుమార్‌, బజారు జట్టు కార్మికులు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్‌: విజయవాడలో ఈ నెల 15న జరగనున్న ప్రజారక్షణ భేరి యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కవురు పెద్దిరాజు అన్నారు. శనివారం పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌, పంజా సెంటర్‌ తదితర ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ప్రచార జాతాలో ఆయన మాట్లాడారు. ఈ నెల ఏడో తేదీ సాయంత్రం ఆరు గంటలకు నరసాపురం అంబేద్కర్‌ రాష్ట్ర బస్సు జాతా సభను నిర్వహిస్తామని, సభలో సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ పి మధు, నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు ముఖ్య వక్తలుగా ప్రసంగిస్తారన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడగా తెలగంశెట్టి సత్యనారాయణ, పొన్నాడ రాము, బూడిద జోగేశ్వరారవు, నోముల కొండ, పొగాకు నారాయణరావు పాల్గొన్నారు.