Oct 19,2023 23:41

సమావేశంలో మాట్లాడుతున్న సిహెచ్‌.బాబూరావు

ప్రజాశక్తి-గుంటూరు : విజయవాడలో వచ్చేనెల 15న జరిగే ఃప్రజారక్షణ భేరిః బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. గురువారం బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి అధ్యక్షతన నిర్వహించారు. బాబూరావు మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయని, మరోవైపు ప్రజలకు ఉపాధి లేక అర్ధాకలితో అలమటిస్తున్నారని అన్నారు. ఇసుక అందుబాటులో లేకపోవడం, సిమెంట్‌, ఇనుము ఇతర బిల్డింగ్‌ మెటీరియల్‌ ధరలు పెరిగిపోవడంతో భవననిర్మాణ కార్మికులకు చేతినిండా పని లేదన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనలు, మైనార్టీలపై దాడులు పెరిగాయని విమర్శించారు. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులు, గృహదహనాలు, మహిళలపై అత్యాచారాలు జరగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్‌ రాష్ట్రాన్ని సందర్శించలేదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు అడ్డగోలుగా పెంచిందని, సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్‌ ఛార్జీలు, ఇంధన ఛార్జీల పేరుతో అదనపు భారాలు మోపిందని విమర్శించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాడకుండా రాజీ ధోరణిని అవలంభించడం సిగ్గుచేటని విమర్శించారు. జిల్లాలో పంటలకు అవసరమైన సాగునీటిని విడుదల చేసి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని సమావేశంలో తీర్మానించారు. జిల్లాలో సాగునీటి సమస్య తీవ్రంగా వుందని, కృష్ణా డెల్టాలోని 5.75 లక్షల ఎకరాల భూమి సాగవుతుండగా నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. 8 వేల క్యూసెక్కులు నీరు అవసరం కాగా కేవలం 4 వేల క్యూసెక్కులే విడుదల చేస్తున్నారన్నారు. పంటలకు అవసరమైన నీటిని విడుదల చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. జిల్లాలో రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని, ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకుని నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, పెదవడ్లపూడి హైలెవల్‌ ఛానల్‌ను పూర్తి చేసి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ సమావేశం తీర్మానించింది. సమావేశంలో నాయకులు వై.నేతాజి, ఇ.అప్పారావు, ఎన్‌.భావన్నారాయణ, కె.నళినీకాంత్‌, ఎస్‌ఎస్‌.చెంగయ్య,బి.వెంకటేశ్వర్లు, డి.వెంకటరెడ్డి, కమలాకర్‌ పాల్గొన్నారు.