
15న ప్రజారక్షణ భేరి బహిరంగ సభ
- జయప్రదం చేయాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి
ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్
విజయవాడలో ఈనెల 15న జరిగే ప్రజా రక్షణ భేేరి బహిరంగ సభలో పెద్ద ఎత్తున కార్మికులను, కర్షకులను, ప్రజలను కదిలించి జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నందికొట్కూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నాయకులు కె.భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోడీకి తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్‌కు నిధులు, వెనకబడిన రాయలసీమకు నిధులు కేటాయించాలని పార్లమెంటులో చట్టం చేసినా అమలు జరగడం లేదన్నారు. ప్రధాని రాష్ట్రానికి ద్రోహం చేసినా పల్లెత్తు మాట మాట్లాడకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎకరాకు రూ.25 వేలు పంట నష్ట పరిహారం చెల్లించాలని, రైతుల బ్యాంకు అప్పులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీల వలసలు నివారించేందుకు కుటుంబానికి 200 రోజులు ఉపాధి పని కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై, మైనార్టీలపై, మహిళలపై దాడులు, హత్యాచారలు పెరిగి పోయాయని అన్నారు. తమిళనాడు ,కేరళ ,పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్లు పెత్తనాన్ని చెలాయిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ చెప్పినట్లు గవర్నర్లు దేశంలో పని చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలను బిజెపి నియమించిన గవర్నర్లు తిరస్కరించడం విచారకరమన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. రాజకీయ ప్రత్యామ్నాయ విధానాల కోసం సిపిఎం రాజకీయ ప్రణాళికను రూపొందించిందని, వాటి అమలు కోసం ఈ నెల 15న విజయవాడలో ఎంబి స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ఆలిండియా కార్యదర్శి సీతారామ్ ఏచూరి, పొలిటి బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరవుతున్నారని తెలిపారు. బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వరకు సభ్యులు ఎం.నాగేశ్వరావు, నాయకులు పి ఓబులేష్, ఎం.కర్ణ, ఉస్మాన్ భాష, ఆంజనేయులు, నాగన్న, రంగమ్మ, హుస్సేనమ్మ, జయరాని, రామిరెడ్డి, ఏసన్న, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్ : అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నెల 15న విజయవాడలో జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని డాక్టర్ ఏ.ధనుంజయ మీటింగ్ హాల్‌లో సిపిఎం డివిజన్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదా సాధనలో, ప్రాజెక్టులను పూర్తి చేయడంలో, ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పించడంలో, నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, రైతులకు గిట్టుబాటు ధరలు, కరువు నివారణ సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ప్రత్యేక హోదా, పరిశ్రమలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.యేసురత్నం, సీనియర్ నాయకులు ఎ.రాజశేఖర్, నాయకులు మంజుల, మీనాక్షమ్మ, ఎ.రణధీర్, ఎం.రజాక్, పాములపాడు మండల కార్యదర్శి డి. స్వామన్న, ఆత్మకూరు మండల కార్యదర్శి నరసింహ నాయక్, నాయకులు టి.వెంకటేశ్వరావు, పి.సుధాకర్, ఎన్.స్వాములు, ఎ.సురేంద్ర, షైక్ ఇస్మాయిల్, డి.రామ్ నాయక్, జి.నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : ఈ నెల 15న విజయవాడలో జరుగుతున్న ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం మండల నాయకులు ఎన్.స్వాములు, ఎస్.సంజీవ రాయుడు కోరారు. మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలో బహిరంగ సభ గోడపత్రికలను విడుదల చేశారు. సిపిఎం నాయకులు ఎన్.దాసు, ఎన్.దేవకుమార్, జి.దాసు, హనుమంతు, స్వాములు తదితరులు పాల్గొన్నారు.