Nov 04,2023 21:34

చలో విజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని, నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈ నెల 15న విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో చలో విజయవాడ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయకుండా, రావాల్సిన నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా.. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు కేంద్రాన్ని ప్రశ్నించకుండా బిజెపికి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజా ఉద్యమాలను చేపట్టిన వారిపై నిర్బంధాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రజారక్షణభేరి బస్సు యాత్రను సిపిఎం చేపట్టిందన్నారు. రక్షణ భేరి ముగింపు సందర్భంగా ఈ నెల 15న విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. బహిరంగ సభకు జిల్లా నుండి వేలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, టివి రమణ పాల్గొన్నారు.