Oct 26,2023 00:01

బహిరంగ సభ వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న పాశం రామారావు, ఇతర నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : సిపిఎం ఆధ్వర్యంలో 15న విజయవాడలోని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ప్రజారక్షణ భేరి పోస్టర్‌ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు ముందుగా అక్టోబర్‌ 30వ తేదీ నుండి లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు బస్సు యాత్రలు బయలుదేరి 15న విజయవాడకు చేరుకుంటాయని చెప్పారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు ఆకాశన్నంటుతున్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసి, టెలికం, రైల్వే, రక్షణ రంగం, పోర్టులు తదితర సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు కారుచౌకగా కట్టబెతున్నారని, రాష్ట్రంలో కీలక పరిశ్రమగా ఉన్న విశాఖ ఉక్కును సైతం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం, రాజధాని, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వంటి అనేక హామీలు ఇచ్చిన విస్మరించిందన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని మోసం చేసిన బిజెపి పట్ల రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షాలు సాగిలపడే ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా చేపడుతున్న ఆందోళనలపైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిర్భంధం ప్రయోగిస్తోందని మండిపడ్డారు. ఎడాపెడా విద్యుత్‌ చార్జీలు పెంచి, ప్రజలపై మోయలేని భారం మోపిందని, పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను భారాలు వేసిందని తెలిపారు. ఈ విధానాలపై ప్రజలు ఉద్యమించాలన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, కె.నళినీకాంత్‌, ఇ.అప్పారావు, జిల్లా కమిటి సభ్యులు ఎంఎ.ఛిష్టి పాల్గొన్నారు.