Oct 24,2023 23:50

పెదనందిపాడు సమావేశంలో మాట్లాడుతున్న ఈమని అప్పారావు

ప్రజాశక్తి - పెదనందిపాడు, దుగ్గిరాల : అసమానతలులేని అభివృద్ధి కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 15వ తేదీన విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ప్రజారక్షణభేరి బహిరంగ సభని జయప్రదం చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రమైన పెదనందిపాడులోని తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో ఎం.వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించగా మండల కేంద్రమైన దుగ్గిరాలలోని సిపిఎం కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ దేశానికి ప్రమాదకరంగా బిజెపి తయారైందని, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. దేశాన్ని రక్షించడం కోసం వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించడం అవసరమన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బిజెపి మరోవైపు ప్రజాసమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులతో అణచివేస్తోందని అన్నారు. బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైందని, బుల్డోజర్‌ రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తోందని విమర్శించారు. బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మైనార్టీలకు, దళితులకు, మహిళలకు భద్రత లేకుండా పోతుందన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే లేబర్‌ కోడ్‌లను తెచ్చిందని, వ్యవసాయానికి చేటు చేసే, ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెచ్చే నల్ల వ్యవసాయ చట్టాలను తేవడంతోపాటు వాటికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలపై దమనకాండ ప్రయోగించిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను కారు చౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాయపట్నం మేజర్‌ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, రైల్వేజోన్‌ వంటి విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు. పైగా విశాఖ ఉక్కును అమ్మటానికి కుట్ర చేస్తోందన్నారు. అయినా రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి వంతపాడుతున్నాయని విమర్శించారు. స్త్రీలను నడిరోడ్డు మీద నగంగా ఊరేగించిన వాళ్లకు మద్దతివ్వడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రలోని బిజెపి ప్రభుత్వం చెప్పిందానికి తలాడిస్తున్న రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రజలపై తీవ్ర భారాలు వేస్తోందన్నారు. విద్యుత్‌ ఛార్జీల రూపంలో పెనుభారం మోపిందని, స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తోందని, ఆస్తి పన్ను పెంచడంతోపాటు చెత్తపన్ను వేస్తోందని తెలిపారు. నిర్బంధాలనూ ప్రయోగించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందన్నారు. నూతన విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒపిఎస్‌ అమలు చేస్తామని వాగ్దానాన్ని ఇచ్చి జిపిఎస్‌ తెచ్చిందని, ఇది ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. ఆశాలకు, కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులకు చేసిన వాగ్దాలన్నీ వైసిపి ప్రభుత్వం విస్మరించిందని తెలిపారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిపిఎం పెదనందిపాడు, దుగ్గిరాల మండలాల కార్యదర్శులు డి.రమేష్‌బాబు, జె.బాలరాజు మాట్లాడుతూ ఒకటో తేదీ నుండి కాకుమాను, పెదనందిపాడు, దుగ్గిరాల మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తామన్నారు. బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. కార్యక్రమాల్లో నాయకులు కె.వెంకట సుబ్బారావు, సిహెచ్‌.యానాదులు, పి.శేషగిరిరావు, ఎం.లక్ష్మి, పి.సలీం, ఎం.రమణ, వై.బ్రమేశ్వరరావు, ఎం.నాగమల్లేశ్వరరావు, బి.చిరంజీవి పాల్గొన్నారు.