
ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 15న విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజారక్షణ భేరి బహిరంగ సభ పోస్టర్‌ను బ్రాడీపేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు అకాశాన్నంటుతున్నాయని, పెద్ద ఉల్లిపాయ ధరలు భగ్గుమంటున్నాయని అన్నారు. మరోవైపు సాధారణ ప్రజలకు ఉపాధి తగ్గి ఆదాయం పెరగక జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు, విశాఖ రైల్వేజోన్‌కు నిధులు, కడప ఉక్కు ప్రభుత్వ రంగంలో నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ద్రోహం చేసిందని మండిపడ్డారు. ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చు పెడుతోందని, భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మతోన్మాద బిజెపిని చిత్తుగా ఓడించాలని పిలపునిచ్చారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు బిజెపికి కొమ్ముకాసే విధానాలనే అవలంబిస్తున్నాయని, ఆ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కేంద్రం విధానాలనే తూచా తప్పకుండా అమలు చేస్తోందన్నారు. వ్యవసాయ పుంపు సెట్లుకు మీటర్లు బిగించే విధానాన్ని ఉపసంహరించుకోకుంటే ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్భంధకాండను ప్రయోగిస్తుందన్నారు. ఈ విధానాలకు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బస్సు యాత్రలకు ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, ఇ.అప్పారావు, కె.నళినీకాంత్, నాయకులు కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.